Champions Trophy 2025 Teamindia : వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా పాల్గొనడంపై కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే అసలు ఆ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకునే దిశగా ముందుకువెళ్తోంది. అయితే తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
వాస్తవానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ మూడు వేదికలను ఖరారు చేసింది. లాహోర్, కరాచి, రావల్పిండిలో టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు రచించింది. ఈ విషయాన్ని మరోసారి పీసీబీలోని ఓ అధికారి తెలిపారు. ముఖ్యంగా టీమ్ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌ల కోసం లాహోర్‌ను వేదికగా ఫిక్స్ చేసిందట. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే పీసీబీ ఐసీసీకి పంపినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. "అవును, టీమ్ఇండియాకు హోమ్ బేస్‌గా లాహోర్‌ను వేదికగా పరిశీలించారు. ఈ వేదిక వల్ల భారత జట్టుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. అలానే వారి కోసం అత్యుత్తమ భద్రతా ఏర్పాట్లను చేయబోతున్నారు. ఐసీసీకి డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను కూడా పంపించారు" అని వెల్లడించారు.
కాగా, ఆటగాళ్ల భద్రత, ఇతర కారణాల వల్ల టీమ్ఇండియా చాలాకాలంగా పాక్ పర్యటనకు వెళ్లడం ఆపేసింది. చివరిసారిగా 2008 ఆసియా కప్ కోసం అక్కడ పర్యటించింది. గతేడాది ఆసియా కప్ మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ వెళ్లడానికి బీసీసీఐ నిరాకరించడంతో హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించారు. పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు, మిగతా 9 మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌లో టీమ్ఇండియా పర్యటిస్తుందా, లేదా అనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.