How To Pay Credit Card Bills : క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లు చాలా క్రమశిక్షణగా ఉండాలి. బిల్ పేమెంట్‌లో ఏ మాత్రం జాప్యం చేసినా వడ్డీరేట్లు, ఆలస్య చెల్లింపు ఛార్జీలను బాదేస్తారు. ఒకటికి మించి క్రెడిట్ కార్డులను కలిగిన వారికి ఒక ప్రత్యేకమైన చెల్లింపు మార్గం అందుబాటులో ఉంటుంది. అదేమిటంటే, ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డుకు సంబంధించిన బిల్లులను చెల్లించొచ్చు. ఇందుకోసం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, యూపీఐ, క్యాష్ అడ్వాన్స్ వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని వినియోగించుకునే ముందు కార్డులోని క్రెడిట్ లిమిట్, రుణాన్ని తిరిగి చెల్లించేందుకు కార్డుదారుడికి ఉన్న సామర్థ్యం అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ పట్టించుకోకుండా ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లిస్తే అప్పుల భారం భారీగా పెరిగిపోతుంది.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్
ఒక క్రెడిట్ కార్డులో బకాయి ఉన్న బ్యాలెన్సును మరో క్రెడిట్ కార్డుకు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించే పద్ధతే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్. ఈవిధంగా బకాయి మొత్తాన్ని మరో కార్డుకు బదిలీ చేస్తే ప్రత్యేకమైన ఛార్జీని విధిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఛార్జీ బ్యాంకును బట్టి మారిపోతుంటుంది. తక్కువ వడ్డీరేట్లు విధించే క్రెడిట్ కార్డుల ద్వారా ఈ రకమైన బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లావాదేవీలు చేయొచ్చు.
డిజిటల్ వ్యాలెట్లు
డిజిటల్ వ్యాలెట్ల ద్వారా మనం క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించొచ్చు. ఇందుకోసం తొలుత డిజిటల్ వ్యాలెట్‌కు మనం డబ్బులను యాడ్ చేయాలి. తదుపరిగా ఆ వ్యాలెట్‌కు క్రెడిట్ కార్డును లింక్ చేయాలి. ఈక్రమంలో మన కార్డు నంబర్‌ను సమర్పించాలి. ఆ వెంటనే ఫోన్ నంబరుకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే డిజిటల్ వ్యాలెట్‌కు క్రెడిట్ కార్డు అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈజీగా డిజిటల్ వ్యాలెట్ నుంచే ప్రతినెలా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.
క్యాష్ అడ్వాన్స్
ఏటీఎంకు వెళ్లి క్రెడిట్ కార్డు ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక లిమిట్ ఉంటుంది. అంతమేర నగదును మాత్రమే మనం క్రెడిట్ కార్డు నుంచి తీయగలం. ఈవిధంగా డబ్బులు తీసుకోవడం వల్ల భారీగా విత్‌డ్రా ఛార్జీలు పడతాయి. ఇలా తీసుకునే డబ్బులను మన సాధారణ బ్యాంకు ఖాతాలో వేసుకొని, దాని నుంచి మరో క్రెడిట్ కార్డుకు సంబంధించిన బిల్లు బకాయిలను చెల్లించొచ్చు. మరే మార్గం లేనప్పుడు మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలి.
పైన మనం చెప్పుకున్న పద్ధతులన్నీ అత్యవసరాల్లోనే వాడాలి. సాధారణంగానైతే మనకు వచ్చే నెలవారీ ఆదాయం నుంచే క్రెడిట్ కార్డుల బిల్లులను చెల్లించే ప్రయత్నం చేయాలి. కార్డు ఉంది కదా అని అనవసర ఖర్చులు చేయకూడదు. దుబారాకు దూరంగా ఉండేవారికే క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
మీ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు త్వరలో ఎక్స్‌పైర్ అవున్నాయా? - ఇలా వాడితే ఫుల్ బెనిఫిట్స్!
ఫ్రీగా 'SBI ఉన్నతి' క్రెడిట్ కార్డ్- నాలుగేళ్ల వరకు నో ఫీజు- బోలెడు బెనిఫిట్స్ కూడా!