Bumrah Rested For Third Test:ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్ విజయంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి యార్కర్ కింగ్ బుమ్రా 9 వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ప్రమాదకరమైన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో బుమ్రానే పెవిలియన్ చేర్చి టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. ఇక రెండుజట్లు తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టాయి. అయితే ఇలాంటి సమయంలో ఈ స్టార్ పేసర్ మూడో టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏంటంటే?
ఫిబ్రవరి15నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. అంటే ఇప్పటినుంచి 10రోజుల గ్యాప్ ఉంది. అయితే మరో ఐదు రోజులు పొడగించి బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్టుకు విశ్రాంతినిచ్చి చివరి రెండు టెస్టులకు ఫ్రెష్‌గా మళ్లీ బరిలో దింపాలన్న ప్లాన్‌లో ఉందట. తొలి రెండు టెస్టుల్లో కలిపి బుమ్రా 57.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండు జట్లలో కలిపి మరే ఫాస్ట్ బౌలర్ కూడా ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేయలేదు. అయితే రెండో టెస్టులో బెంచ్‌కు పరిమితమైన మహ్మద్ సిరాజ్‌ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరి మూడు టెస్టులకు టీమ్ఇండియా జట్టును ప్రకటించాల్సి ఉంది.