Border - Gavaskar Trophy 2024 Shubman Gill Injury : ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు ఆడలేకపోయాడు.
అయితే తాజాగా అతడి గాయంపై ఓ కీలక విషయం తెలిసింది. వేలికి అయిన గాయం ఇంకా తగ్గలేదని సమాచారం అందింది. దీంతో అతడు ప్రైమ్‌మినిస్టర్స్ XI జట్టుతో జరిగే రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఆడడని అంటున్నారు. ఇంకా అడిలైడ్ వేదికగా జరగనున్న పింక్ బాల్ టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. గిల్‌కు కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమట. ఆ తర్వాతే అతడి గాయం ఎంత వరకు తగ్గిందో పరిశీలిస్తారట.
"శుభ్‌మన్ గిల్‌కు కనీసం 14 రోజుల విశ్రాంతి అవసరం. ఈ విషయాన్ని మెడికల్ టీమ్ సిఫార్సు చేసింది. వార్మప్ మ్యాచ్‌లో అతడు ఆడడు. రెండో టెస్టు డిసెంబర్ 6న ప్రారంభం అవుతుంది. అప్పుడు అతడి గాయం పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటికీ కూడా పూర్తిగా కోలుకోకపోతే, అతడు రెండో టెస్టుకు దూరం కావడం కచ్చితమే. ఒకవేళ గాయం తగ్గితే, రెండో టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాడు. అప్పుడే తుది జట్టుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.