తెలంగాణ

telangana

ETV Bharat / sports

సంపద ఉన్నా - స్టేడియాలు సరిగ్గా లేవ్! - ఇక బీసీసీఐ అలా చేయాల్సిందే! - BCCI Stadiums Poor Maintainence - BCCI STADIUMS POOR MAINTAINENCE

BCCI STADIUMS POOR MAINTAINENCE : దేశవ్యాప్తంగా ఉన్న మైదానాల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

Source Associated Press
Stadiums Poor Maintainence (Source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 30, 2024, 11:21 AM IST

KANPUR TEST NO RAIN NO PLAY :భారత్-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కూడా రద్దవ్వడంపై కాన్పూర్​లోని గ్రీన్ పార్క్ స్టేడియంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెండో రోజులానే ఆదివారం కూడా ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైంది. అయితే ఆదివారం పెద్దగా వర్షం అంతరాయం లేకపోయినా, ఎండగా ఉన్నా కూడా, మైదానం చిత్తడిగా మారిందని అంపైర్లు మూడో రోజు ఆటను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో వర్షం లేకపోయినా ఆట రద్దవ్వడంపై క్రికెట్ ఫ్యాన్స్​ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

మూడు సార్లు తనిఖీ- ఆ తర్వాత ఆట రద్దు

అంపైర్లు, మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ ఆదివారం ఉదయం ఓ సారి మైదానం పరీక్షించగా, అక్కడక్కడ పిచ్ సిద్ధంగా లేకపోవడం వల్ల ఆటను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత 12 గంటలకు ఒకసారి, 2 గంటలకు మరోసారి పిచ్‌, మైదానాన్ని పరిశీలించి మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 30 యార్డ్ సర్కిల్ తడిగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంపై గ్రీన్ పార్క్ స్టేడియం క్యూరేటర్ శివ కుమార్ స్పందించారు. "మ్యాచ్ అధికారులు మూడుసార్లు పిచ్​ను తనిఖీ చేశారు. కానీ సమస్య ఏంటో మాకు ఎప్పుడూ చెప్పలేదు. పిచ్​లోని ఏ ప్రాంతం తడిగా ఉంది. సమస్య ఏంటి అనే విషయం తెలియజేయలేదు. మ్యాచ్​ను ప్రారంభించవచ్చని వారితో చెప్పాను. అయినా ప్రారంభించలేదు. " అని ఓ ఆంగ్ల పత్రికకు శివ కుమార్ తెలిపారు.

'అందుకే రద్దు చేశారు'

"మ్యాచ్ అధికారులు సహజ కాంతి వస్తే ఆటను ప్రారంభించాలని చూశారు. మైదానం, పిచ్ లోని కొన్ని భాగాలు బాగానే ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు చిత్తడిగా మారిపోయాయి. అయినా మ్యాచ్​ను ప్రారంభించవచ్చు. కానీ అధికారులు మధ్యాహ్నం రెండు గంటలకు మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు." అని గ్రీన్ పార్క్ స్టేడియం అధికారి ఒకరు వెల్లడించారు.

నిరాశ చెందిన క్రికెట్ ఫ్యాన్స్

అయితే భారత్-బంగ్లా మధ్య జరిగే రెండో టెస్టును చూసేందుకు గ్రీన్ పార్క్ స్టేడియానికి వచ్చిన అభిమానులు మూడో రోజు ఆట రద్దు అవ్వడంపై నిరాశ చెందారు. 1952 నుంచి టెస్టులకు ఆతిథ్యమిస్తున్న గ్రీన్ పార్క్ స్టేడియంను బాగా మెయింటెన్ చేయాలని ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్​ను కోరుతున్నారు. "నేను చాలా బాధగా ఉన్నాను. దేశంలో ఉన్న పురాతన మైదానాల్లో గ్రీన్ పార్క్ ఒకటి. మూడేళ్ల తర్వాత ఇక్కడ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఐదు రోజులపాటు సాగాల్సి ఉంది. కానీ అలా జరగట్లేదు. ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, మ్యాచ్ నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అందుకే మూడు రోజుల ఆట రద్దైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మ్యాచ్‌ చూసేందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ ఏం ప్రయోజనం, ఆట రద్దువుతుంది." అని ఫతేపూర్​కు చెందిన ఓ అభిమాని చెప్పాడు. ఎండ ఉన్న రోజు కూడా మ్యాచ్ రద్దు అవ్వడం ఏంటని కాన్పూర్​కు చెందిన మరో అభిమాని ప్రశ్నించాడు.

ఇకానా స్టేడియంపై అందరీ దృష్టి(Ekana stadium)

భారత్- బంగ్లా టెస్టు మ్యాచ్​ను నిర్వహించడంలో విఫలమైన గ్రీన్ పార్క్ స్టేడియం భవిష్యత్తులో నష్టపోవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ మ్యాచ్​లకు గ్రీన్ పార్క్​ను వేదికగా ఎంచుకోకపోవచ్చని అంచనా వేశాయి. గ్రీన్ పార్క్ స్టేడియంపై విమర్శలు తలెత్తడం వల్ల అత్యాధునిక సదుపాయాలతో ఉన్న లఖ్ నవూలోని ఇకానా స్టేడియంపై అందరి దృష్టి పడింది. గ్రీన్ పార్క్ స్టేడియానికి ప్రత్యామ్నాయంగా ఇకానా మైదానాన్ని ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఇఖానా స్టేడియంలో ఐపీఎల్, గతేడాది ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ మ్యాచులు సైతం జరిగాయి. అఫ్గానిస్థాన్- వెస్టిండీస్ మధ్య టెస్ట్ కూడా జరిగింది. ఈ మ్యాచ్ లన్నింటిని ఇకానా స్టేడియం సమర్థవంతంగా నిర్వహించింది.

గతంలోనూ ఇలానే

ఇక భారత్- బంగ్లా మధ్య జరుగుతున్న టెస్టులో తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట కొనసాగింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 107-3 స్కోర్​తో ఉంది. క్రీజులో మొమినుల్ హక్ (40 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (6 పరుగులు) ఉన్నారు. ఆ తర్వాత మ్యాచ్ మూడు రోజుల ఆట రద్దైంది. ఈ క్రమంలో స్టేడియం డ్రైనేజీ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయి. అయితే గ్రీన్ పార్క్ స్టేడియంలో గతంలోనూ మ్యాచ్​లు రద్దైన సందర్భాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం అఫ్గానిస్థాన్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓ టెస్టు మ్యాచ్ పిచ్ అవుట్ ఫీల్డ్ కారణంగా ఒక బంతి పడకుండానే రద్దైంది.

బీసీసీఐపై విమర్శలు(POOR DRAINAGE STADIUMS)

కాగా, మ్యాచుల నిర్వహణకు కీలకమైన మైదానాల విషయంలో దారుణ అనుభవాలను బీసీసీఐ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రికెట్ బోర్డు ఇలా చేయడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా, భారత్-బంగ్లా మధ్య టెస్టు జరుగుతున్న గ్రీన్ పార్క్ స్టేడియమే కాకుండా, అహ్మదాబాద్‌, నోయిడాలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వర్షం ఆగిన గంటల వ్యవధుల్లోనే స్టేడియాలు సిద్ధమయ్యేలా మౌలిక వసతులు అక్కడ లేకపోవడం గమనార్హం.

ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ సమయంలోనూ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆ తర్వాత వర్షం కాస్త ఆగినా మైదానం సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. రీసెంట్​గా నోయిడా వేదికగా అఫ్గానిస్థాన్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన టెస్టు మ్యాచ్‌ రద్దైంది. కానీ, ఆ తర్వాత వర్షం లేకపోయినా మైదానం మాత్రం ఆట నిర్వహణకు సిద్ధంగా లేదనే కారణంతో రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఇంకెప్పుడు తాము నోయిడాకు వచ్చేది లేదని అఫ్గాన్‌ క్రికెటర్లు అన్నారు. ఇంకా చెప్పాలంటే భారత్​లో బెంగళూరు మినహా ఏ మైదానంలోనూ సరైన వసతులు లేవంటే నమ్మడం కష్టమే.

చిన్నస్వామి స్టేడియం అదుర్స్(SUB AIR SYSTEM TECHNOLOGY STADIUM)

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఎంత వర్షం పడినా కేవలం 30 నిమిషాల్లోనే మ్యాచ్ కు స్టేడియం సిద్ధమైపోతుంది. మ్యాచ్‌ నిర్వహణకు సిద్ధం చేసే అత్యాధునిక వ్యవస్థ చిన్నస్వామి స్టేడియంలో ఉంది. అక్కడ ఉన్న సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీగా చెప్పొచ్చు. వాక్యూమ్‌ పవర్డ్‌ డ్రైనేజీ సిస్టమ్​తో ఈ విధానంలో ఒక్క నిమిషంలోనే దాదాపు 10 వేల లీటర్ల నీటిని పీల్చేస్తుంది. ఒకవేళ గంటల పాటు భారీ వర్షం పడి ఆగినా, 30- 40 నిమిషాల్లో మ్యాచ్‌ ను నిర్వహించుకునేలా మైదానాన్ని సిద్ధం చేసేయొచ్చు. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ కోసం 2015లోనే 10-12 మిలియన్‌ డాలర్లను కర్ణాటక బోర్డు ఖర్చు చేసింది. ఇలాంటి టెక్నాలజీని దేశంలోని స్టేడియాల్లోనకి తీసుకొస్తేనే బీసీసీఐ మ్యాచ్​లను సక్రమంగా నిర్వహించగలదు.

మరోసారి వరుణుడి 'బ్రేక్​' - మూడో రోజు ఆట కూడా రద్దు - INDIA VS BANGLADESH 2ND TEST

సింగిల్ బాల్​కు 286 రన్స్​ - పిచ్ మధ్యలో 6కిమీ పరుగు- క్రికెట్​లో రేర్ సీన్ - One Ball 286 Runs

ABOUT THE AUTHOR

...view details