Australia Open 2024 Winner : డిఫెండింగ్ ఛాంపియన్‌గా మైదానంలోకి దిగిన అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. తాజాగా జరిగిన ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ జెంగ్ కిన్వెన్‌పై సబలెంక 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయాన్ని సాధించింది. తొలి సెట్‌లో కాస్త పోరాడిన జెంగ్, ఆ తర్వాత చేతులెత్తేసింది. 2013 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను వరుసగా రెండోసారి దక్కించుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.
లీ నా తర్వాత పదేళ్లలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న తొలి చైనా అమ్మాయిగా ఇప్పటికే ఘనత సాధించిన 21 ఏళ్ల జెంగ్ ఫైనల్‌లో మాత్రం సబలెంకతో పోటీపడలేకపోయింది. మరోవైపు టెన్నిస్ స్టార్ సెరెనా తర్వాత వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన ప్లేయర్‌గా సబలెంకా రికార్డుకెక్కింది. అంతే కాకుండా ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ గెలిచిన ప్లేయర్ల లిస్ట్‌లో 2007 తర్వాత సబలెంక టాప్ పొజిషన్లో ఉంది. ఆ ఏడాది సెరీనా విలియమ్స్ కూడా ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ట్రోఫీని ముద్దాడింది.
ఇలా ఆస్ట్రేలియా ఓపెన్‌లో బ్యాక్ టు బ్యాక్ టోర్నీలు గెలవడం ద్వారా సబలెంకా దిగ్గజ ప్లేయర్ల సరసన నిలిచింది. 2009, 2010లో సెరీనా విలియమ్స్ ఈ ఫీట్ సాధించగా, 2012, 2013లో విక్టోరియా అజరెంక వరుసగా రెండు టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సబలెంకనే ఈ రికార్డులో చోటు సంపాదించింది.