Ashwin 500 Wickets Record :మైదానంలో తమ ప్రత్యర్థి ఎటువంటి షాట్ ఆడగలడో అని ముందే ఊహించి ఎలా వికెట్ పడగొట్టాలనే ప్రణాళిక రచించే ఇంజీనీర్ ఈ స్టార్ బౌలర్. బ్యాటర్ మైండ్‌లో ఉన్నది ఇట్టే చదివే మేధావి అతడు. బాల్‌ను తన క్రంట్రోల్లోకి తెచ్చుకుని చేతి వేళ్లతోనే మాయ చేసే మాంత్రికుడు అతడు. వైవిధ్యమైన అస్త్రాలతో ప్రత్యర్థులను మట్టికరిపించే యోధుడు అతడు.
ఇలా అన్నీ కలగలిసిన స్పిన్ చాణక్యుడు మన స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఘనతను తాజాగా అందుకున్నాడు ఈ చెన్నై వీరుడు. ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన మూడో టెస్టులో ఓ వికెట్ సాధించి ఈ ఫార్మాట్లో 500 వికెట్ల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. ఈ 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అశ్విన్ కంటే ముందు ఈ రికార్డును 8 మంది మాత్రమే సొంతం చేసుకున్నారంటే ఇది ఎంత విశిష్టమైన రికార్డో ఇప్పటికే అర్థం చేసుకోవచ్చు.
2011లో టెస్ట్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్, తన 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. పలు మార్లు ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు కూడా. తొలి మూడేళ్లలో అతను 23 టెస్టులు ఆడి 114 వికెట్లను పడగొట్టాడు. కానీ ఆ తర్వాత వైవిధ్యమైన బంతులతో మైదానంలో మరింతగా చెలరేగిపోయాడు. 2015 జనవరి నుంచి స్వదేశంలో ఆడిన 43 టెస్టుల్లో 252 వికెట్లు, ఆ తర్వాత విదేశాల్లో 32 టెస్టుల్లో 134 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక 56 టెస్టుల్లో 347 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో కనీసం 200 వికెట్లు తీసిన బౌలర్లలో అతనిదే అత్యుత్తమ సగటు (21.22). సొంతగడ్డపై అశ్విన్ ఆడిన 57 టెస్టుల్లో భారత్ 42 గెలిచింది. ఓవరాల్‌గా 97 టెస్టుల్లో 56 విజయాలను సాధించింది. 10 సార్లు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా అశ్విన్ చరిత్రకెక్కాడు.