Lionel Messi Crying Copa America: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 2024 కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మెస్సీ ఈ ఫైనల్లో ఆఖరి వరకూ గ్రౌండ్లో లేడు. అయితే గేమ్ ఫస్ట్ హాఫ్‌లో మెస్సీ కుడికాలి చీలమండకి గాయమైంది. దీంతో నొప్పితో మెస్సీ విలవిల్లాడాడు. వెంటనే ఫిజియోలు చికిత్స అందించారు. తర్వాత మెస్సీ మళ్లీ ఆటలో కొనసాగాడు. దీంతో అతడి చీలమండ వాపుతో ఉబ్బింది. ఫిజియోల సూచన మేరకు మెస్సీ మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
అయితే తన కెరీర్లో ఇదే ఆఖరి మ్యాచ్ కావడం వల్ల ఆట ముగిసేదాకా గ్రౌండ్లో ఉండాలనే ఉద్దేశంతో మెస్సీ బరిలోకి దిగాడు. కానీ, ఇలా ఆట మధ్యలో గాయం కారణంగా డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో మెస్సీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. డగౌట్లో కూర్చోని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ప్రేక్షకులు మెస్సీని అలా చూడలేకపోయారు. మైదానంలో ఇది చూసిన మెస్సీ ఫ్యాన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక అర్జెంటీనా 2024 కోపా అమెరికా టైటిల్ నెగ్గింది. సోమవారం కొలంబియాతో జరిగిన ఫైనల్లో 1- 0 తేడాతో నెగ్గి ఛాంపియన్‌గా నిలిచింది.
అప్పట్నుంచే : 2021కి ముందు మెస్సీ ఒక్క ఇంటర్నేషనల్ టైటిల్ కూడా నెగ్గలేదు. 2021 జూన్ తర్వాత మెస్సీకి గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. అప్పట్నుంచి మెస్సీ వరుసగా నాలుగు ఇంటర్నేషనల్ ట్రోఫీలు నెగ్గాడు. 2021 కోపా అమెరికా, 2022 ఫైనలిసిమా, 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2024 కోపా అమెరికా టైటిళ్లు నెగ్గాడు.