Anderson 700 Wickets:ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు కెరీర్లో అరుదైన ఘనత అందుకున్నాడు. ధర్మశాల టెస్టులో రెండు వికెట్లు తీసిన అండర్సన్ ఈ ఫార్మాట్లో 700 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రంలో 700 వికెట్ల క్లబ్లో చేరిన తొలి పేసర్‌గా అండర్సన్ రికార్డు కొట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ పేసర్‌పై పలువురు మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా అండర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
2002లో అండర్సన్ బౌలింగ్‌ను తొలిసారి చూసిన సందర్భాన్ని తెందూల్కర్ గుర్తుచేసుకున్నాడు. '2002 ఆస్ట్రేలియాలో అండర్సన్ ఆడడాన్ని నేను తొలిసారి చూశాను. బంతిని అండర్సన్ నియంత్రించిన తీరు స్పెషల్‌గా అనిపించింది. నాజిర్ హుస్సేన్ అతడి గురించి చాలా గొప్పగా మాట్లాడేవాడు. 700 వికెట్ల ఘనత సాధించడం గొప్ప విషయం. ఓ ఫాస్ట్ బౌలర్ 22ఏళ్లుగా కెరీర్లో నిలకడగా రాణిస్తూ 700 వికెట్ల ఘనత అందుకోవడం కల్పితంగా అనిపించేది. కానీ, అండర్సన్ దాన్ని నిజం చేశాడు' అని సచిన్ ట్వీట్ చేశాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు
- ముత్తయ్య మరళీధరన్ (శ్రీలంక)- 800 వికెట్లు
- షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)- 708 వికెట్లు
- జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్)- 700 వికెట్లు
- అనిల్ కుంబ్లే (భారత్)- 619 వికెట్లు
- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్)- 604 వికెట్లు