2024 Top Google Trends :భారతీయులకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడైనా సరే క్రికెట్ మ్యాచ్ ఉంటే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. అలా వీలుపడని వాళ్లు టీవీకి అతుక్కుపోతారు. అదీ కుదరకపోతే మొబైల్‌లో కళ్లు పెట్టేస్తారు. తమకు నచ్చిన మ్యాచ్ గురించో, ఇతర క్రీడల గురించో చకచకగా వెతికేసి స్కోర్లు, అప్డేట్లు తెలుసుకుంటారు.
అలా క్రికెట్‌కు సంబంధించిన రెండు ఈవెంట్లు 2024లో గూగుల్ ట్రెండ్స్ టాప్‌లో చోటు దక్కించుకున్నాయి. అందులో ఒకటి ICC టీ20 వరల్డ్ కప్ కాగా, రెండోది ఇంగ్లాండ్ - భారత్ టెస్టు సిరీస్. ఈ రెండు ఈవెంట్లు 2024 గూగుల్ ట్రెండ్స్ టాప్‌లో చోటు దక్కించుకున్నాయని ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఓ స్క్రీన్ షాట్ షేర్ చేశారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్
ఈ ఏడాది జూన్ 30న దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 169 పరుగులకే పరిమితమైంది. దీంతో 17 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా మరో టీ20 ట్రోఫీని ముద్దాడింది.
అలాగే ఈ మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా విజయం, స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ వంటి ఈ అంశాల వల్ల వరల్డ్‌కప్ టాప్ గూగుల్ ట్రెండ్స్ 2024లో టాప్‌లో చోటు దక్కించుకుని ఉండొచ్చు.
భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఇంగ్లాండ్- భారత్ టెస్టు సిరీస్ కూడా టాప్ గూగుల్ ట్రెండ్స్ 2024లో చోటు సంపాదించుకుంది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లీష్ జట్టుపై టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 4-1 తేడాతో సిరీస్ ఎగరేసుకుపోయింది.
అది మాత్రం ఛేదు అనుభవం
ఈ ఏడాది టీమ్ఇండియా పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కివీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది. 0-3తో ఓడిపోయింది. దీంతో భారత్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వదేశంలో సిరీస్ ఓడిపోవడంపై పలువురు మాజీలు సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయంతో ఏడాది ముగించాలని
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో గెలిచి ఈ ఏడాదిని విజయంతో ముగించాలని టీమ్ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో తొలి రోజు ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది.