Yedu Varala Nagalu History In Telugu :ఎన్ని కాలాలు, యుగాలు మారినా బంగారానికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. హిందూ మతవిశ్వాసాల ప్రకారం చూసినా బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. బహుశా అందుకేనేమో బంగారం విలువ పెరగడమే కానీ తగ్గడం అంటూ లేదు. మహిళలకు బంగారం పట్ల మక్కువ ఎక్కువ. కనీసం ఒక్క బంగారు నగ అయినా ఉండాలని కోరుకునే వారు ఎంతోమంది ఉంటారు. సమృద్ధిగా బంగారం ఉన్నవారు కూడా మార్కెట్లోకి కొత్త డిజైన్లు వస్తే వదిలిపెట్టరు. అందుకే బంగారం వ్యాపారం లాభసాటి అయిన వ్యాపారం.
ఏడువారాల నగలుంటే గొప్ప ప్రతిష్ట
దాదాపు 100ఏళ్ల క్రితం శ్రీమంతుల ఇంట్లో మహిళలకు ఏడు వారాల నగలుండేవి. ఇంట్లో మహిళలందరికీ ఏడు వారాల నగలుండడం ప్రతిష్ఠగా భావించేవారు. ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు ఏడువారాల నగలు పుట్టింటి వారు కానీ, అత్తింటి వారు కానీ పెట్టడం ఆనవాయితీగా ఉండేది.
ఏడు వారాల నగలంటే?
మనకు వారంలో ఏడు రోజులుంటాయి. ఒక్కో వారానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం అనుకూలత కోసం ఒక్కో రకమైన రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. అందుకే వారంలోని ఏడురోజులపాటు ఏ రోజు ఏ రత్నం ధరించాలో ఆ ప్రకారం తయారు చేయించుకునేవే ఏడు వారాల నగలు. ఈ ప్రకారం ధరించడం వలన ఒక వారంలో అన్ని గ్రహాల అనుకూలతలు పొంది సుఖమయ జీవనం ఉంటుందని విశ్వాసం.
ఏ రోజు ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలి?
ఆదివారం
ఆదివారాన్ని భానువారమని కూడా అంటారు. ఆదివారం సూర్య గ్రహానికి చెందినది. ఈ రోజు కెంపులతో చేసిన ఆభరణాలను ధరిస్తే సూర్య గ్రహం అనుకూలతతో అనారోగ్య సమస్యలు దూరమై మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు చేకూరుతుంది.
సోమవారం
సోమవారాన్ని ఇందువారమని కూడా అంటారు. సోమవారానికి అధిపతి చంద్ర గ్రహం. ఈ రోజు ముత్యాలతో చేసిన ఆభరణాలను ధరించాలని శాస్త్రం చెబుతోంది. చంద్రుడు మనః కారకుడు కాబట్టి ముత్యాలతో చేసిన ఆభరణాలు ధరిస్తే మానసిక సమస్యలు దూరమై మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది.
మంగళవారం
మంగళవారాన్ని జయవారమని కూడా అంటారు. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజ గ్రహాన్నే అంగారక గ్రహమని కూడా అంటారు. మంగళవారం పగడాలతో చేసిన ఆభరణాలను ధరించాలని శాస్త్రం చెబుతోంది. మంగళవారం పగడాల నగలను ధరిస్తే కుజగ్రహ అనుకూలతతో వివాహం కానీ వారికీ వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలుంటే తొలగిపోతాయి. సంతానం కోరుకునే వారికీ సంతాన ప్రాప్తి ఉంటుంది.