"రేపు" ఈ రెండక్షరాల మాట ప్రతి ఒక్కరిలో ఎన్నో ఆశలు రేకెత్తిస్తుంది. నిజానికి మనిషికి ఊపిరి పోసేది రేపటి మీద ఆశ అంటే అది అతిశయోక్తి కాదు. నిన్న గతం. నేడు నిజం. రేపు కల. కలలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే! నేను ఇది చేస్తాను అది సాధిస్తాను అంటూ అందరూ రేపటి గురించి మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. నూతన సంవత్సరం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం.
అనుభవాలే జ్ఞాపకాలు
కొత్త ఏడాదిలోకి ప్రవేశించే ముందు పాత సంవత్సరంలో మనం సాధించింది ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. చేసిన పొరపాట్లను దిద్దుకుంటూ, పంచుకున్న మంచిని పెంచుకుంటూ ముందుకు సాగాలి. పాత సంవత్సరంలో మనకు కలిగిన అనుభవాలే జ్ఞాపకాలుగా మార్చుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. తప్పులు ఎవరైనా చేస్తారు కానీ సరిదిద్దుకున్నవారే గొప్పవారు. ఒక్కసారి పాత సంవత్సరంలో మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకుని స్ఫూర్తిని పొందాలి. పొందిన ఓటమికి కారణాలు గుర్తించి అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి.
ఈ నిర్ణయాలు తీసుకుందాం
వీలయితే న్యూ ఇయర్ రోజు మీకు నచ్చని మీ అలవాటును వదిలి పెట్టడానికి ప్రతిజ్ఞ చేయండి. కొత్త ఏడాదిలో ఎన్నో రోజులుగా మీరు సాధించాలని అనుకుంటున్న మీ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోడానికి దృఢ సంకల్పం చేసుకోండి. బంధు మిత్రులతో ఆనందంగా గడపండి. మంచి విషయాలు షేర్ చేసుకోండి. పెద్దల ఆశీర్వాదాలు ఎంతో ముఖ్యం. వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇక మీకు అంత మంచే అన్న విశ్వాసం మీ మనసుకే తెలుస్తుంది.
సెలబ్రేషన్ టైం!
హ్యాపీగా న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోకుండా ఈ సూక్తులు ఎందుకంటారా! ఇక చాలు ఆపేద్దాం. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ 31 వ రోజు సాయంత్రమే మొదలై పోతాయి. సాయంత్రం 6 గంటల నుంచే అందరూ పార్టీ మూడ్ లోకి వెళ్లిపోతారు. పార్టీ చేసుకోండి హాయిగా ఎంజాయ్ చేయండి. కానీ భద్రంగా ఇంటికి చేరండి. రేపటిరోజు నూతన సంవత్సరానికి నాంది పలికే రోజు. ఈ రోజు కుటుంబంతో సంతోషంగా గడపాలి. జనవరి 1 ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేయడం వలన ఆ దైవబలం పాజిటివ్ ఎనర్జీగా మారి సంవత్సరమంతా మీకు తోడుగా ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం న్యూ ఇయర్ పార్టీకి రెడీ అయిపోండి! హ్యాపీ న్యూ ఇయర్ అనే విషెస్ చెప్పుకోడానికి మాత్రమే కాకుండా సంవత్సరమంతా నిజంగా హ్యాపీగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. అదే అసలైన నిజమైన హ్యాపీ న్యూ ఇయర్!
నూతన సంవత్సర శుభాకాంక్షలు- HAPPY NEW YEAR 2025