Producer Dil Raju Responds on KTR Words : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ జరిపిన సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంతో సమావేశంలో సెటిల్మెంట్ చేసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికిన దిల్ రాజు, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలు ఆపాదించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజకీయ దాడి, ప్రతిదాడులకు సినీ పరిశ్రమను వాడుకోవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం ఉండాలన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుగా జరిగిన వ్యవహారం కాదన్న దిల్ రాజు, పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా సమావేశం జరిగినట్లు వెల్లడించారు. ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు పేర్కొన్నారు. సామాజిక సంక్షేమానికి బాధ్యతగా పరిశ్రమగా సహకారాన్ని సీఎం కోరారని తెలిపారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనేది సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమని, ఆ సంకల్పాన్ని పరిశ్రమ ప్రతినిధులుగా తామంతా స్వాగతిస్తున్నట్లు ఎఫ్‌డీసీ ఛైర్మన్ హోదాలో దిల్ రాజు వెల్లడించారు.
సినిమా వాళ్లతో సీఎం సెటిల్మెంట్ అని కేటీఆర్ ఆరోపణ : ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సుమారు 50 మందికి పైగా సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంగా ఈ సమావేశం జరగగా సీఎం రేవంత్ సినీ ప్రముఖులకు పలు సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం మాజీమంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీపై వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే, ప్రచారం కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సినిమా వాళ్ల గురించి అలా మాట్లాడారని పేర్కొన్నారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్ పాకులాడారని అన్నారు. సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాట్లాడట్లేదని ఆరోపించారు.
సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తోందా? - క్లారిటీ ఇచ్చిన తమ్మారెడ్డి
ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు - సినీ ప్రముఖులకు తేల్చి చెప్పిన సీఎం