TTD Alert to Devotees on Water Usage :తిరుమలలో కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా వేలాది మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తుంటారు. ఇలా నిత్యం జనంతో కిటకిటలాడే తిరుమల(Tirumala) గిరులలో నీటి వినియోగంపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే తిరుమలలోని స్థానికులు, ఉద్యోగులు, భక్తులకు సూచనలతో కూడిన కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తిరుమలలో ఏటా రుతుపవనాల సమయంలో కురిసే వర్షపు నీటిని నిల్వ చేసి.. సంవత్సరం పొడవునా యూజ్ చేస్తుంటారు. కానీ, ఈ సంవత్సరం ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా.. తిరుమలలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుమల అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న నీళ్లు ఎంతకాలం వస్తాయి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంచనాలు వేశారు.
డైలీ 43 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం :
ప్రతిరోజూ తిరుమలలో దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యామ్ నుంచి.. మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి సేకరిస్తుంటారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే జలాశయాల్లో అందుబాటులో ఉన్నట్టు టీటీడీ అధికారులు తేల్చారు.