Significance of Bhogi Pallu in Telugu: సంక్రాంతి పండగకు సమయం ఆసన్నమైంది. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకొనేదే భోగి పండుగ. భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి వేడుకలో భోగిపళ్లది ప్రత్యేక స్థానం. ఈ రోజు సందడంతా చిన్నారులదే. ఎందుకంటే భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పళ్లు పోస్తారు. అయితే ఈ రోజున సరైన విధానంలోనే భోగి పళ్లు పోస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు లభిస్తాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
భోగి పళ్ల వెనుక కథ ఇదే: భోగి పళ్లు ఎందుకు పోయాలో మహాభారతంలోని ద్రోణ పర్వంలో చెప్పారని అంటున్నారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి "నువ్వు తపస్సు చేశావు కాబట్టి నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నా" అని నారాయణుడికి శివుడు వరం ఇస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలందరూ ఆనందంలో నారాయణుడి తల మీద బదరీ ఫలాలని కురిపించారని, ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు చిన్నపిల్లాడి మాదిరి మారిపోయాడని మహాభారతంలోని ద్రోణ పర్వం చెబుతోందని మాచిరాజు వివరిస్తున్నారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని చెబుతున్నారు.
ఎందుకు పోస్తారు: రేగు పండ్లనే ఈ రోజున భోగి పళ్లుగా పిలుస్తారని, వీటిని అర్కఫలం అని కూడా అంటారని మాచిరాజు అంటున్నారు. అర్కుడు’ అంటే సూర్యుడని, సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కావడంతో ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారని మాచిరాజు చెబుతున్నారు. అలాగే పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందనీ చెబుతున్నారు. అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని వివరిస్తున్నారు.
ఎలా పోయాలి? :
- ముందుగా ఓ ప్లేట్లోకి రేగిపండ్లు తీసుకోవాలి. అందులోకి బంతి పూల రేకులూ, చిల్లర నాణేలూ, చెరకు గడల ముక్కలూ కలిపాలి.
- ఆ తర్వాత తల్లి కొన్ని రేగుపండ్లు తీసుకుని మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి.
- ఆ తర్వాత మిగిలిన వారు తలో దోసిటతో వీటిని తలచుట్టూ మూడు సార్లు తిప్పి పోయాలి.
- చిన్నపిల్లలపై భోగి పళ్లు పోసేటప్పుడు "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలి.
- ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెట్టాలని చెబుతున్నారు. ఈ పళ్లను తినవద్దని చెబుతున్నారు. ఎందుకంటే, పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసి వేసే పళ్లు కనుక వాటిని తినటం మంచిది కాదట.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వైకుంఠ ఏకాదశి స్పెషల్ - "విష్ణు సహస్రనామాలు" ఎలా వచ్చాయో తెలుసా?