China Manja Slits Mans Finger in Nalgonda : దారం తగిలి చేతివేలు నరం తెగిదంటే నమ్ముతారా అంటే నమ్మాల్సిందే. అది మాములు దారం కాదు మరీ చైనా మాంజా. సంక్రాంతి పండుగ వచ్చిదంటే చిన్నారులు, యువకులు సరదాగా గాలి పటాలు ఎగురవేసేందుకు వినియోగించే మాంజా కొందరి పాలిట శాపంగా మారుతోంది. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినా అధికారుల పర్యవేక్షణ లోపంతో మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.
చైనా మాంజాతో తెగిన చేతివేలు : బీబీనగర్ గౌడబస్తీకి చెందిన పంజాల ప్రకాష్ గౌడ్ ఎయిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. డిసెంబరు రెండో వారంలో ఆసుపత్రి విధుల నుంచి మధ్యాహ్నం భోజనానికి బైక్‌పై ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బీబీనగర్ స్టేజ్ సమీపంలో ఓ తెగిన పతంగి మాంజా చేతికి తగిలి ఎడమ చేతివేలు నరం తెగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చైనా మాంజాను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ నెల 10న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం చింతగుంపు గ్రామానికి చెందిన వంశీ గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. బిల్డింగ్ మీదుగా వెళ్లే 11కేవీ లైన్‌కు చిక్కుకున్న మాంజాను లాగే క్రమంలో రెండు వైర్లు కలవటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గొంతుకు గాయం : ఈ నెల 1న చంద్రుగొండ మండలం గుర్రాయిగూడేనికి చెందిన కృష్ణరావు కొత్తగూడెం రామవరం వద్ద చైనా మాంజా తగిలి గొంతుకు గాయమైంది. ఆయకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిచారు.
చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఇవి పాటిస్తే మేలు : -
- ఖాళీ ప్రదేశాలు లేదా మైదానాల్లో పతంగులు ఎగురవేయాలి.
- గాలిపటాలను ఎగురవేయడానికి నైలాన్, సింథటిక్ దారాలు, చైనా మాంజాలు వాడొద్దు.
- విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మార్లకు దూరంగా ఎగురవేయాలి.
- విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద మాంజా చిక్కుకుంటే వదిలేయాలి.
- ఒకవేళ వాటిని లాగితే తీగలు కలుసుకుని విద్యుదాఘాతానికి గుర్యయ్యే ప్రమాదముంది.
- చిన్నారులను గాలిపటాలతో ఒంటరిగా బయటకు వెళ్లనీయొద్దు. వారి వెంట ఎవరో ఒకరు ఉండేలా చూసుకోవాలి.
- తీగలకు చిక్కుకున్న గాలిపటాన్ని చిన్నారులు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిపై ఎప్పుడు ఒక కన్ను వేసుంచాలి. వాటిని తీయడానికి ఇనుప కడ్డీలు, పైపులు, పచ్చి కర్రలు ఉపయోగిస్తారు. అలా చేస్తే షాక్ తగులుతుందని పిల్లలకు అవగాహన కల్పించాలి.
- బాల్కానీ గోడలు, ప్రహరీలపై నిల్చొని గాలిపడాలు ఎగురవేస్తే జారిపడిపోయే ప్రమాదముంటుంది.
- నాన్-బయోడీగ్రేడబుల్ మాంజాల తయారీ, విక్రయాలు చట్టప్రకారం నిషేధం. దీన్ని అతిక్రమించిన వ్యాపారులకు జైలుశిక్ష, జరిమానా విధించే వీలుంది.
- తెగిపోయిన పటాలతో ఎక్కడైనా విద్యుత్తు ప్రమాదాలు జరిగే అవకాశముంటే స్థానికులు టోల్‌ఫ్రీ నంబర్ ‘1912కు సమాచారమివ్వాలి.
ప్రమాదాలకు కారణమౌతున్న చైనా మాంజా - జనగామలో నలుగురికి గాయాలు