తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వాస్తుప్రకారం - మీ ఇంట్లో కారు, బైక్ ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలుసా? - VASTU TIPS FOR PARKING VEHICLES

Vehicles Parking Vastu Tips : మీకు కారు లేదా బైక్ ఉందా? అయితే దానిని ఇంట్లో వాస్తుప్రకారం పార్కింగ్ చేస్తున్నారా? అదేంటి వెహికల్​ పార్కింగ్​కు కూడా వాస్తు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. వాహనాలను పార్కింగ్ చేయడానికి వాస్తుప్రకారం పార్కింగ్ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే?

Parking Vastu Tips
Vastu Tips

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 9:52 AM IST

Vastu Tips for Vehicles Parking : ఈరోజుల్లో దాదాపు అందరి ఇళ్లల్లో కారు, బైక్, స్కూటీ, ఆటో.. ఇలా ఏదో ఒకటి కామన్​ అయిపోయాయి. అయితే, చాలా మంది ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లోని వస్తువుల అమరిక, ఇంటి బయట డిజైన్, కలర్స్, ప్రవేశ ద్వారం, గేట్ల వరకు వాస్తుశాస్త్ర నియమాలను ఫాలో అవుతారు. కానీ, తమకు ఉన్న వాహనం పార్కింగ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తుంటారు. అయితే, వాస్తుప్రకారం వాహనాన్ని సరైన ప్లేస్​లో పార్క్ చేయకపోవడం వల్ల కూడా జీవితంలో వివిధ సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

ముఖ్యంగా మీ వాహనాన్ని ఇంట్లో వాస్తుప్రకారం.. సరైన దిశలో నిలుపకపోతే అది మానసిక ఒత్తిడికి దారితీయవచ్చునని, ప్రమాదాలు వంటి భౌతిక నష్టం లేదా ఆర్థిక నష్టాలనూ కలిగించవచ్చంటున్నారు వాస్తు పండితులు. లేదంటే.. నిరంతరం రిపేర్లతో ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెబుతున్నారు. అయితే, ఇంతకీ వాస్తు ప్రకారం.. ఏ దిశలో కారు(Car), ద్విచక్రవాహనాన్ని నిలిపితే మంచిది? సెల్లార్​, వరండాలో ఏ విధంగా పార్క్​ చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాహనాల పార్కింగ్​కు మంచి దిశలు : వాస్తుప్రకారం.. ఇంట్లో కారు లేదా ద్విచక్రవాహనం పార్క్ చేయడానికి తూర్పు లేదా ఉత్తర దిశలు చాలా అనువైనవని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో పెద్ద వాహనాల పార్కింగ్, కవర్ కార్ పార్కింగ్ కోసం ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు. అయితే, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. వాస్తుప్రకారం కారు లేదా స్కూటర్​ను ఎప్పుడూ ఈశాన్య దిశలో పార్క్ చేయకండి. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల​ ఆర్థికంగా ధన నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని, మానసిక ఒత్తిడి పెరగవచ్చని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారా? - అయితే, వాస్తు ప్రకారం ఈ నియమాలు పాటించాల్సిందే!

సెల్లార్​లో పార్కింగ్​ : వాస్తు ప్రకారం.. సెల్లార్​లో కూడా వాహనాన్ని సరైన దిశలో పార్కింగ్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తు పండితులు. మీ కారును సెల్లార్​ లేదా గ్యారేజీలో ఉత్తరం లేదా తూర్పు దిశలో పార్క్ చేయాలనుకుంటే.. అందులోకి ప్రవేశించే దిశ ఆగ్నేయం లేదా నైరుతి నుంచి ఉండకూడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వాస్తుప్రకారం.. సెల్లార్​లో తగినంత వెంటిలేషన్, పగటి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే.. గ్యారేజ్ ఫ్లోర్ వాల్ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవడం, కారు తాళాలను, మాన్యువల్​ను వాయువ్య దిశలో ఉంచడం వాస్తుప్రకారం శుభప్రదమని వాస్తుపండితులు చెబుతున్నారు.

వరండాలో పార్కింగ్ : మీ ఇంట్లో వాహనం పార్కింగ్ కోసం సెల్లార్​ని నిర్మించలేకపోతే వాస్తుప్రకారం.. ఇంటి వరండాలో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పార్కింగ్ కోసం షెడ్​ని ఏర్పాటుచేసుకోవచ్చు. అలాగే మీ ఇంటికి నైరుతి భాగం వరండా ఉంటే కార్లను అక్కడ పార్క్ చేయడం శుభప్రదమట. షెడ్ నిర్మాణం కోసం మెటల్ లేదా ఫైబర్​ యూజ్ చేస్తున్నట్లయితే వాస్తుప్రకారం ఫైబర్ షీట్ రంగును ఎంచుకోవడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు. ఇక వరండా మీ ఇంటికి తూర్పు నుంచి దక్షిణ దిశలో ఉంటే అక్కడ ఒక మొక్కను నాటడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. వాస్తుప్రకారం.. ఇది అదృష్టంగా పరిగణించడమే కాకుండా ఆర్థిక లాభాలకు సహాయపడుతుందని చెబుతున్నారు వాస్తు పండితులు.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వాస్తు ప్రకారం రోజూ ఈ పనులు చేస్తే - ఇంట్లో సుఖసంతోషాలు 10 రెట్లు పెరగడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details