తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

షష్టిపూర్తి వేడుకలకు ప్రత్యేక ఆలయం - ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శిస్తే గండాలన్నీ దూరం! - AMRUTHA GHATESWAR TEMPLE

షష్టిపూర్తి వేడుకలకు ప్రత్యేకమైన అమృత ఘటేశ్వర ఆలయం- ఎక్కడుందంటే?

Amrutha Ghateswar Temple
Amrutha Ghateswar Temple (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2024, 3:44 PM IST

Amrutha Ghateswar Temple :మన దేశంలో అతి ప్రాచీనమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలను సందర్శిస్తే చాలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఇలా కోరిన కోర్కెలన్నీ తీరుతాయి. కానీ ఎక్కడలేని విధంగా కేవలం షష్టిపూర్తి వేడుకలకు మాత్రమే ప్రసిద్ధమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.

షష్టిపూర్తి అంటే?
తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయి. ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ పుట్టినా ఈ అరవై సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరంలోనే పుట్టాలి. ప్రభవ మొదలుకొని అక్షయ వరకు ఉన్న 60 సంవత్సరాలలో ఒక వ్యక్తి జన్మించిన తరువాత తిరిగి అతనికి 60 సంవత్సరాల వయసు నిండేటప్పటికీ అతను జన్మించిన సంవత్సరం తిరిగి వస్తుంది. అలా రావడాన్ని షష్టిపూర్తి అని అంటారు.

షష్టిపూర్తి ఉత్సవం ఎందుకు చేస్తారు?
వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం కాలగమనంలో ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు నిండే సమయంలో గండం ఉంటుందని అంటారు. అందుకే షష్టిపూర్తి పేరుతో చేసే ఉత్సవంలో ఆయుష్షు హోమం, భీమరథి ఉత్సవం పేరుతో శాంతి హోమాలు జరిపిస్తారు. ఇలా చేయడం వలన 60 సంవత్సరాల వయసులో వచ్చే గండాలు తొలగిపోయి ఆ వ్యక్తి నిండు నూరేళ్లు జీవిస్తాడని విశ్వాసం. అందుకే 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ షష్టిపూర్తి వేడుకలు జరిపించుకుంటారు. ఇలాంటి షష్టిపూర్తి వేడుకలకు ప్రత్యేకమైన ఆలయం తమిళనాడులో ఉంది.

అమృత ఘటేశ్వర్ అభిరామి ఆలయం
సామాన్యంగా భగవంతుని పూజించే వారు ఆయువు, ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకుంటారు. తమిళనాడులోని అమృత ఘటేశ్వరుడిని దర్శించుకుంటే, ఈ మూడింటిలోని మొదటిదైన ఆయుర్దాయం తప్పక పెరుగుతుందని భక్తుల విశ్వాసం. యముడి మరణ స్థలంగా పేరున్న ఈ గుడిలో రోజూ కనీసం 50 నుంచి 60 షష్టిపూర్తి వేడుకలు జరుగుతుంటాయి. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని తిరుక్కడయూర్ పట్టణం మైలాదుత్తురై కి 22కిమి దూరం, పోరయార్ నుంచి 8 కిమి దూరంలో వెలసిన ఈ కోవెలలో పరమేశ్వరుడు 'అమృత ఘటేశ్వరుడు' అనే పేరుతో పూజలందుకుంటున్నాడు.

ఆలయ స్థల పురాణం
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతభాండాన్ని దేవతలు తీసుకుంటారు. అయితే పాల సముద్రాన్ని చిలికే ముందుగా గణాధిపతి అయిన తనను దేవతలు ఎవరు పూజించలేదని వినాయకుడికి కోపం వస్తుంది. దీంతో అలిగిన వినాయకుడు పాల సముద్రంలోంచి అమృతం పుట్టగానే దానిని తీసుకొని వచ్చి ప్రస్తుతం అమృత ఘటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు ఉన్న చోట దాచేస్తాడు. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి, తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ప్రార్ధనలో భాగంగా కొంత అమృతాన్ని శివలింగంపై అభిషేకిస్తాడు.

జరిగిన అపరాధాన్ని తెలుసుకొని దేవతలు వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించగా సంతుష్టుడైన వినాయకుడు అమృతభాండాన్ని దేవతలకు తిరిగిచ్చేస్తాడు. వినాయకుడు అమృతంతో అభిషేకించిన కారణంగా ఈ కోవెలలో పరమేశ్వరుడు 'అమృత ఘటేశ్వరుడు' అనే పేరుతో పూజలందుకుంటున్నాడు. నాడు అమృతాన్ని కాజేసిన కారణంగా ఈ ఆలయంలోని వినాయకుడిని 'కల్ల వినాయకర్' అంటే దొంగ వినాయకుడు అని పిలుస్తారు.

ఆలయ విశేషాలు
ఆలయంలోని ప్రధాన శివలింగానికి ఎడమ వైపున శివుని పాదాలను చుట్టుకున్నట్లుగా మార్కండేయుడు, శివుని యముడిని శిక్షిస్తున్నట్లుగా ఉండే విగ్రహాలు ఉంటాయి. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

మార్కండేయుని గాథ
మృకండుడు అనే మహర్షి, ఆయన భార్య సంతానం కోసం శివుని గురించి కఠోర తపస్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చుకున్న శివుడు ప్రత్యక్షమై 'మీకు పూర్ణాయుష్కుడైన దుష్టుడు కావాలా? లేక సర్వోత్తముడై, కేవలం 16 ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం గల కుమారుడు కావాలా?' అని అడగగా, వారు 16 ఏళ్లు మాత్రమే జీవించే ఉత్తమ కుమారుడిని ఇవ్వమని కోరతారు.

మార్కండేయుని తపస్సు
శివుని అనుగ్రహంతో మృకండ దంపతులకు ఒక కుమారుడు కలుగుతాడు. అతడే మార్కండేయుడు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ సకల విద్యాపారంగతుడై తల్లిదండ్రులకు పేరు తెస్తాడు. కానీ అతడికి 16 ఏళ్లు రాగానే తండ్రి కుమారుడికి శివుని వరం గురించి చెప్పేస్తాడు. దీంతో తనకు మిగిలిన కొద్దిపాటి జీవిత కాలాన్ని శివ ధ్యానంలో గడపాలని మార్కండేయడు నిర్ణయించుకుని, అందుకు తగిన స్థలం కోసం వెతుకుతూ, నేటి అమృత ఘటేస్వరుని ఆలయానికి వచ్చి అక్కడే మహా మృతుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండిపోతాడు.

యమపాశం నుంచి రక్షించిన శివుడు
మార్కండేయునికి 16 ఏళ్లు నిండగానే, యముడు మార్కండేయుడిని తీసుకుని పోయేందుకు పాశాన్ని చేతబూని అక్కడికి చేరాడు. భయపడిన బాల మార్కండేయుడు అక్కడి శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. దీంతో ఆ పాశం శివలింగంపై పడటం వల్ల క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముని వధిస్తాడు.

ముల్లోకాలు అల్లకల్లోలం
యముని మరణంతో ముల్లోకాలు అల్లకల్లోలం కాగా, దేవతల కోరికపై శివుడు యముడిని తిరిగి బతికించటమే గాక మార్కండేయుడికి చిరంజీవిగా ఉండే వరమిస్తాడు.

మార్కండేయుడు చిరంజీవిగా మారిన ఈ ఆలయంలో ఆయుష్షు హోమం చేయించుకుంటే అకాలమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం.

అభిరామి అమ్మవారి మహత్యం
ఈ ఆలయంలో వెలసిన అభిరామి అమ్మవారు చాలా మహిమ గల తల్లి అనడానికి ఓ పౌరాణిక గాథ ఉంది.

అభిరామ భట్టారకుని గాథ
అభిరామ భట్టారకుడు పార్వతిదేవికి అమిత భక్తుడు. ఒకరోజు ఇతను అమ్మవారి ధ్యానంలో ఉండి తన పక్కనే నిలబడిన మహారాజును పట్టించుకోలేదు. అందుకు ఆగ్రహించిన మహారాజు అభిరామ భట్టారకుడిని 'ఈ రోజు తిథి ఏమిటి?' అని అడగగా, అమ్మవారి ధ్యానంలో ఉన్న అభిరాముడు, అమావాస్యకు బదులుగా పున్నమి అని పొరబాటున జవాబిస్తాడు.

అభిరాముడికి కఠిన శిక్ష
అభిరాముని పరధ్యానానికి ఆగ్రహించిన రాజు అభిరాముని ఒక చెక్కకు కట్టి, భగభగమని మండే లోతైన అగ్నిగుండంలోకి మెల్లమెల్లగా దించమని ఆదేశిస్తాడు. వేడి, మంటలకు ధ్యానం నుంచి బయటికి వచ్చిన భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అష్టోత్తరం చదవడం మొదలు పెడతాడు.

ప్రత్యేక అష్టోత్తరం
ఈ అష్టోత్తరంలో ప్రత్యేకత ఏమిటంటే మొదటి నామం యొక్క చివరి అక్షరంతో తర్వాతి నామం మొదలవుతుంది. ప్రాణభిక్ష పెట్టమని అమ్మవారిని వేడుకుంటూ ఆర్తిగా కన్నీటితో అభిరామ భట్టారకుడు 70వ నామం చదువుతుండగా, అమ్మవారు తన చెవి కుండలాన్ని ఆకాశంలోకి విసురుతుంది.

పూర్ణ చంద్రుడిలా మెరిసిన అమ్మవారి కర్ణాభరణం
అమ్మవారు విసిరిన కర్ణాభరణం ఆకాశంలో పూర్ణ చంద్రుడిలా మెరుస్తూ కనిపించటంతో దాన్ని చూసిన మహారాజు అభిరామ భట్టారకుని క్షమించమని వేడుకొని అప్పటి నుంచి అమ్మవారి పేరు అభిరామిగా మార్చి అమ్మవారి సేవ చేసుకుని అక్కడే శివైక్యం చెందుతాడు. తర్వాతి రోజుల్లో అభిరామ భట్టారకుడు కుడా అమ్మవారి ధ్యానంలోనే జీవన్ముక్తిని పొందుతాడు. ఇన్ని ప్రత్యేకతలున్న అమృత ఘటేశ్వర్ అభిరామి ఆలయాన్ని మనం కూడా దర్శించుకుందాం. ఆయురారోగ్యాలను పొందుదాం. ఓం నమః శివాయ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details