తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శ్రీరామ నవమి అందరికీ తెలుసు - సీతా నవమి తెలుసా? - ఆ శుభసమయం ఈ నెలలోనే! - Sita Navami 2024

Sita Navami Significance 2024 : అందరికీ శ్రీరామనవమి పండుగ గురించి తెలుసు! దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజున అంగరంగవైభంగా సీతారాముల కల్యాణం జరుపుకుంటారు. మరి, సీతా నవమి గురించి మీకు తెలుసా? దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతా నవమి వేడుకలను జరుపుకుంటారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Sita Navami Significance
Sita Navami Significance 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 10:49 AM IST

Sita Navami Significance 2024 :ఈ ఏడాదిఏప్రిల్ 17వ తేదీన దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే.. సరిగ్గా నెల తర్వాత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతా నవమి జరుపుకుంటారు. కానీ ఈ పండుగ గురించి మెజార్టీ జనాలకు తెలియదు! ఈ సీతా నవమి రోజున మహిళలు ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆ సీతమ్మవారికి పూజలు చేస్తే.. సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ నెలలోనే సీతా నవమి జరుపుకోనున్నారు. సీతా నవమి విశిష్టత ఏంటీ? ఏ రోజున జరుపుకుంటారు? ఆ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

హిందూ సంప్రదాయాల ప్రకారం.. ప్రతి ఏటా వైశాఖ మాసంలో తొమ్మిదవ రోజున సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతినే 'సీతా నవమి' అని కూడా పిలుస్తారు. అయితే.. శ్రీరామ నవమి, సీతా నవమి పండుగలు రెండూ కూడా నవమి తిథి రోజున రావడం విశేషం. పురాణాల ప్రకారం.. ఈ రోజునే ఆ సీతమ్మ వారు జన్మించారని పండితులు చెబుతున్నారు. పెళ్లైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ సీతాదేవికి పూజలు చేస్తే భర్త ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీతా నవమి ఈ సంవత్సరం మే 16వ తేదీన గురువారం రోజున వస్తుంది.

శుభముహూర్తం:
సీతా నవమి పండుగ మే 16వ తేదీన ఉదయం 6:22 గంటలకు ప్రారంభమై.. మే 17వ తేదీన శుక్రవారం ఉదయం 08:48 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 01:43 గంటల వరకు సీతాదేవిని పూజించడానికి మంచి సమయమని పండితులు చెబుతున్నారు.

సీతా నవమి విశిష్టత :
ప్రధానంగా సీతా నవమిని మహిళల పండుగగా భావిస్తారు. ఈ రోజున మహిళలు తమ భర్త ఆయుష్షు కోసం సీతాదేవికి పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సీతా దేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే.. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలూ తలెత్తవని అంటున్నారు. సీతా జయంతి రోజున ఆ సీతారాములను పూజించడం వల్ల 16 మహాదానాల ఫలం, భూదాన ఫలంతోపాటు అన్ని తీర్థయాత్రలనూ దర్శించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం..

వైశాఖ శుక్ల నవమి నాడు మంగళవారం రోజున పుష్య నక్షత్రమునందు జనక మహారాజు ఇంట్లో సీతాదేవి అవతరించిందని ప్రతీతి. జనక మహారాజు తమ రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తాడు. అయితే, ఒక రోజు జనకుడు పొలం దున్నుతుండగా మట్టిలో నుంచి ఒక బంగారు పెట్టె బయటపడుతుంది. ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఈ ఆడబిడ్డను జనకుడు తన కుమార్తెగా స్వీకరిస్తాడు. బంగారు పెట్టే దొరికిన పొలం పేరు మీదనే సీతా దేవికి ఆ పేరు వచ్చిందట. అదేవిదంగా.. జనకుని కుమార్తె అయినందుకు ఆమెకు జానకి అనే పేరు కూడా వచ్చింది.

ఈ రోజున ఏం చేయాలి?

  • సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే అక్కడ స్నానం చేస్తే ఇంకా మంచిది.
  • తర్వాత ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే కొత్త బట్టలు ధరించాలి.
  • పూజ గదిలో సీతారాములవిగ్రహాన్ని లేదా ఫొటోని ప్రతిష్టించాలి.
  • సీతాదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు వంటి మంగళకరమైన వస్తువులను సమర్పించాలి.
  • నువ్వులు లేదా నెయ్యితో దీపం వెలిగించాలి.
  • 'ఓం శ్రీ సీతయే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
  • అలాగే సీతమ్మవారికి నైవేద్యం సమర్పించి.. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి.
  • ఇలా నియమనిష్టలతో మహిళలు సీతానవమి రోజున ఉపవాసం ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

శ్రీరామనవమి స్పెషల్ - జానకి రాముడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఇవే! - Sri Rama Navami Food

జగదేకవీరుడి కల్యాణానికి వేళాయె - శ్రీరామనవమి వేడుకకు ముస్తాబైన భద్రాద్రి - Sri Rama Navami 2024

ABOUT THE AUTHOR

...view details