Padmavathi Brahmotsavam Pedda Sesha Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో రెండో రోజు అమ్మవారికి జరుగనున్న వాహన సేవల విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
పెద్ద శేష వాహన సేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం అమ్మవారు సర్వాలంకార భూషితురాలై పెద్దశేష వాహనంపై తిరు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.
నిత్య కైంకర్యాలు
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవతో మేల్కోలిపి నిత్యార్చన, శుద్ది, కైంకర్య పూజల వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన తరువాత ఉదయం 7 గంటలకు అమ్మవారి ఉత్సవ మూర్తిని వాహన మండపంలో పెద్ద శేష వాహనంపై అధిరోహింప చేసి, అమ్మవారిని తిరుమాడ వీధుల్లో విహరింపజేశారు.
పెద్ద శేష వాహన సేవ విశిష్టత
పద్మావతీ దేవికి కార్తిక బ్రహ్మోత్సవాలలో రెండో వాహనం పెద్దశేషుడు. లక్ష్మీసహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా శయ్యగా, సింహాసనంగా, చత్రంగా, సమయోచితంగా సేవలు అందించే పెద్దశేషుని వాహనంపై అమ్మవారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
దాస్యభక్తికి నిదర్శనం
శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. నిత్యం స్వామిని సేవించే ఆదిశేషునిపై ఊరేగే అమ్మవారిని దర్శించడం పుణ్యదాయకమని, సౌభాగ్య దాయకమని భక్తుల విశ్వాసం. పెద్దశేషుని వాహనంపై ఊరేగే అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.