Significance Of Vaishno Devi Temple : భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉంది. ప్రపంచానికే సంస్కృతీ, సంప్రదాయాలను నేర్పించిన ఘనత భారత దేశానిది. మన దేశంలో ఎన్నో ఆలయాలు మన దేశ చరిత్రకు, భారతీయుల భక్తి భావాలకు అద్దం పట్టేలా నిలిచాయి. అలాంటి వాటిల్లో కాట్రాలో వెలసిన వైష్ణో దేవి ఆలయం కూడా ఒకటి. శక్తిపీఠంగా విరాజిల్లే ఈ ఆలయంలో వైష్ణోదేవిని దర్శించుకున్న వారికి మోక్షమార్గాలు తెరుచుకుంటాయని విశ్వాసం.
వైష్ణో దేవి ఆలయం ఎక్కడ ఉంది?
జమ్ముకశ్మీర్‌లోని కాట్రాకు సమీపంలో వైష్ణోదేవి ఆలయం ఉంది. రుగ్వేద కాలం నాటిదిగా భావించే ఈ ఆలయం సముద్ర మట్టం నుంచి 5,300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై మంచుకొండల మధ్య ఉంటుంది.
ఆలయ స్థల పురాణం
Vaishno Devi Birth Story : దక్షిణభారతంలో రత్నాకరుడు అనే దుర్గా దేవి భక్తుడు ఉండేవాడు. రత్నాకరుడు అతని భార్య నిరంతరం దుర్గా మాతను కొలుస్తూ ఉండేవారు. సంతానం కోసం ప్రార్దించిన ఆ దంపతులకు సాక్షాత్తూ అమ్మవారే వారికి కూతురుగా జన్మిస్తుంది. లక్ష్మీ, సరస్వతీ, పార్వతి ముగ్గురు కలిసిన స్వరూపమే వైష్ణోదేవి. ఆ దంపతులు ఆ బాలికకు వైష్ణవి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు.
రామ దర్శనం కోసం తపస్సు
వైష్ణవి చిన్ననాటి అన్ని విషయాల్లో ఎంతో చురుగ్గా ఉండేది. శ్రీరామునిపై అచంచల భక్తి విశ్వాసాలతో రాముని కళ్లారా చూడాలని తపిస్తూ అరణ్యంలోకి వెళ్లి తపస్సు చేయసాగింది. తొమ్మిది సంవత్సరాల వయసులో వైష్ణవికి శ్రీరాముని దర్శనం కలుగుతుంది. శ్రీరాముని చూసిన తర్వాత వైష్ణవి అతడిని వివాహం చేసుకొమ్మని కోరుతుంది. అప్పుడు శ్రీరాముడు తాను ఏకపత్నీ వ్రతుడనని, ఈ జన్మకు సాధ్యం కాదని చెప్తాడు. అయినా కొన్ని సంవత్సరాల తర్వాత తాను ఇక్కడికి వచ్చినప్పుడు తనను గుర్తు పడితే తప్పకుండా వివాహం చేసుకుంటానని చెబుతాడు శ్రీరాముడు.
త్రికూట పర్వతానికి చేరుకున్న వైష్ణవి
వైష్ణవి త్రికూట పర్వతం చేరుకొని వైష్ణో దేవిగా తపస్సు చేసుకోసాగింది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి ధర్మం, సత్య మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత గురించి బోధించి సాగింది. నానాటికి వైష్ణోదేవి ప్రతిభ, తపః శక్తి ఆ ప్రాంతాల్లో వ్యాపించ సాగాయి. అది చూసి ఆ ప్రాంతంలో ఉన్న ఘోరకనాధ్ అనే బాబా సహించలేకపోయాడు. ఎలాగైనా వైష్ణో దేవిని అక్కడ లేకుండా చేయాలని అనుకొని తన శిష్యుడైన భైరవనాథ్‌ను ఆజ్ఞాపిస్తాడు.
భైరవనాథ్ ఆగడాలు
భైరవనాథ్ వైష్ణోదేవి గురించి తెలుసుకోవడానికి వచ్చి అతి త్వరలోనే ఆమె సామాన్యురాలు కాదని, మహా తపస్వి అని గ్రహించాడు. ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా తపస్సు చేసుకొంటున్న వైష్ణోదేవి ముందు భైరవనాధ్ నిలబడి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. అందుకు వ్యతిరేకించిన వైష్ణోదేవి తపస్సుకు ఆటంకాలు కలిగించసాగాడు.
గుహలో తపస్సు - హనుమ రక్షణ
ఇక అప్పటి నుంచి వైష్ణోదేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకుంది. హనుమంతుని ప్రార్ధించి భైరవనాథ్ తన తపస్సుకు ఆటంకం కలిగించకుండా గుహ బయట రక్షణగా ఉండమంది. తొమ్మిది నెలలపాటు వైష్ణోదేవి గుహలో తపస్సు చేసిన కాలంలో ఎన్నో సార్లు భైరవనాథ్ ఆమె తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నించగా హనుమంతుడు భైరవనాథ్‌ను అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య తొమ్మిది నెలలు యుద్ధం జరిగింది.
భైరవనాథ్ సంహారం
Vaishno Devi Temple Jammu :చివరకు వైష్ణోదేవి తపస్సు పూర్తి చేసుకొని గుహ బయటకు వచ్చి హనుమకు భైరవనాథ్‌కు హనుమంతుడికి జరుగుతున్న యుద్ధాన్ని చూసి కాళీమాత స్వరూపంతో భైరవనాథ్ శిరస్సును ఖండించింది. ఆ దెబ్బకు భైరవనాథ్ శిరస్సు దూరంగా వెళ్లి పడింది. అప్పుడు భైరవనాథ్ అమ్మవారిని ఈ మొండి శరీరంతో బ్రతకలేనని మోక్షాన్ని ఇమ్మని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఎంతో దయతో భైరవనాథ్ శిరస్సు పడిన చోట ఆలయం ఏర్పడుతుందని, వైష్ణోదేవి యాత్రకు వచ్చినవారు భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర వలన ఫలితం ఉండదని, ఆ యాత్ర అసంపూర్ణం అవుతుందని వరమిస్తుంది.