Significance Of Northeast In Vastu : వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిక్కుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇల్లు నిర్మాణ విషయంలో ఈశాన్యానికి ఉన్న ప్రాధాన్యం గురించి అలాగే ఆ దిక్కున ఎటువంటి నిర్మాణాలు చేపడితే ఆ ఇంట్లో వారికీ శుభం జరుగుతుందో తెలుసుకుందాం.
దిక్కులు- విదిక్కులు
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే నాలుగింటిని మనం దిక్కులు అంటాము. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం అనే నాలుగింటిని విదిక్కులు అంటారు.
ఈశ్వరుని స్థానం ఈశాన్యం
దిక్కుల్లో తూర్పునకు ఎంత ప్రాధాన్యం ఉందో విదిక్కుల్లో ఈశాన్యానికి అంతే ప్రాధాన్యం ఉంటుంది. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఈశాన్య దిక్కుకి అధిపతిగా ఉండి ఇంట్లోని వారిని సదా రక్షిస్తూ ఉంటాడు. ఈశాన్య దిక్కులో వాస్తు పురుషుని శిరస్సు ఉంటుందని చెబుతారు. ఈశాన్యం లేని స్థలం ప్రాణం లేని శరీరం వంటిది.
ఈశాన్యం ఐశ్వర్యం
ఈశాన్యం వాస్తు శాస్త్రం ప్రకారం ఉంటే ఆ ఇంటి యజమాని, ఇల్లాలు ఎప్పుడూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. అలాగే సంతానం కూడా మంచి చదువులతో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఎల్లప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు.
ఈశాన్యంలో బరువు ఇంటికి తెచ్చే అరిష్టం
ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చి పెట్టే ఈశాన్యంలో చీపురు పుల్ల అంత బరువు కూడా పెట్టకూడదు. ఈశాన్యంలో ఎలాంటి బరువులు పెట్టకూడదు, ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఆర్థిక పురోభివృద్ధి ఉండదు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడి విపరీతంగా ధనవ్యయం చేయాల్సి వస్తుంది.
ఈశాన్యంలో మొక్కలు పెంచవచ్చా!
ముందుగా మనం చెప్పుకున్నట్లు ఈశాన్యంలో ఎలాంటి బరువు ఉంచకూడదు. అవి మొక్కలైనా సరే! పెద్ద పెద్ద చెట్లు అసలే నిషేధం కనీసం చిన్నపాటి మొక్కలు కూడా పెంచరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.