తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

డిసెంబర్​ 26 సఫల ఏకాదశి - ఇలా పూజ చేస్తే వృత్తిపరంగా విజయం మీదేనట! - SAPHALA EKADASHI POOJA VIDHANAM

-కోరిన కోర్కెలు నెరవేర్చే సఫల ఏకాదశి -ఈ విధంగా పూజ చేస్తే జాతక దోషాలు పోతాయట!

Saphala Ekadashi 2024 Pooja Vidhanam
Saphala Ekadashi 2024 Pooja Vidhanam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 12:49 PM IST

Saphala Ekadashi 2024 Pooja Vidhanam: పురాణాల ప్రకారం మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సఫల ఏకాదశి తిథి అంటే విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే.. ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందంట. అంతేకాకుండా తెలిసీ.. తెలియక చేసిన పాపాలన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఇక ఈ సంవత్సరం సఫల ఏకాదశి డిసెంబర్​ 26వ తేదీన వచ్చింది. అయితే వృత్తి(ఉద్యోగ, వ్యాపార) పరంగా విజయాన్ని అందుకోవాలంటే విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అంటారని మాచిరాజు చెబుతున్నారు. సఫల ఏకాదశి అంటే.. మనం ఏ పని ఆచరించినా, ఏ కోరికలు కోరుకున్న అవి వెంటనే సఫలమవుతాయట.

ఇంట్లో పూజా విధానం ఇదే:

  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే తలస్నానం ఆచరించి పూజ గదిని అలంకరించుకోవాలి.
  • ఇప్పుడు లక్ష్మీ నారాయణుల ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఒకవేళ లక్ష్మీ నారాయణుల ఫొటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహాస్వామి.. ఇలా విష్ణు సంబంధమైన ఫొటో తీసుకుని దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఆ ఫొటో ఎదురుగా వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసిదీపంవెలిగించాలి.
  • ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి. అంటే తెల్లగన్నేరు, నందివర్దనం, తుమ్మి పూలు, జాజిపూలు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి. పూలతో పూజించేటప్పుడు "ఓం నమో నారాయణాయ", "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూలతో పూజించాలి.
  • ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి.

దేవాలయంలో పూజా విధానం: సఫల ఏకాదశి పూజను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. అందుకోసం..

  • ముందుగా ఏదైనా విష్ణు సంబంధమైన(రాముడు, కృష్ణుడు, నరసింహాస్వామి, వేంకటేశ్వర స్వామి) ఆలయానికి వెళ్లాలి.
  • ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయాలి. అంటే 2 లేదా 4 లేదా 6.. ఇలా సరి సంఖ్యలో చేయాలి.
  • దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని గరుడధ్వజ దీపం అంటారు.
  • ఎలా వెలిగించాలంటే.. ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి. అనంతరం సమార్జనం చేయాలంటున్నారు. అంటే దేవాలయంలో ముగ్గులు వేయడం, ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు.

NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ధనుర్మాసంలో ఆలయాల్లో 'తిరుప్పావై' సందడి- ఈ వ్రతం చేస్తే కోరుకున్న వరుడు మీ సొంతం!

పుష్య పౌర్ణమి నుంచి మహాకుంభ మేళా- రాజస్నానం ఎప్పుడు చేయాలి? రూల్స్ ఏమైనా ఉన్నాయా?

ABOUT THE AUTHOR

...view details