Ranjangaon Ganpati Temple History In Telugu : అష్ట వినాయక క్షేత్రాలను దర్శించడానికి ఓ పద్ధతి ఉంది. ఒక వృత్తం ఎక్కడ మొదలు పెడతామో గుండ్రంగా తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేస్తాం. అలాగే అష్ట వినాయక క్షేత్రాలు కూడా ఏ క్షేత్రంలో మొదలు పెట్టి ఏ క్షేత్రంలో పూర్తి చేయాలని దానికి ఓ క్రమ పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతి ప్రకారం ఇప్పటివరకు మనం మొదటి ఏడు క్షేత్ర విశేషాలు తెలుసుకున్నాం. ఈ రోజు చివరిది రంజన్ గావ్ మహాగణపతి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
రంజన్ గావ్ మహాగణపతి క్షేత్రం
అష్టవినాయక క్షేత్రాలలో ఎనిమిదో క్షేత్రమైన రంజన్ గావ్ మహాగణపతి క్షేత్రం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని షిరూర్ తాలూకాలోని రంజన్ గావ్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం 9 - 10 శతాబ్దాల మధ్య నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే 18 వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
ఆలయ స్థల పురాణం
గణేశ పురాణం ప్రకారం త్రిపురాసుర సంహారం చేసే సమయంలో సాక్షాత్తూ పరమశివుడు యుద్ధం ప్రారంభించేముందు విఘ్నాలు తొలగేందుకు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి పూజించాడంట! మహాదేవుడు ప్రతిష్ఠించిన గణపతి కాబట్టి ఈ గణనాథునికి మహాగణపతి అని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
మరో అద్భుతం
రంజన్ గావ్ మహాగణపతి ఆలయంలో సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉంటాడు. అయితే అక్కడి స్థానికుల కథనం ప్రకారం ప్రస్తుతం ఉన్న వినాయకుని విగ్రహం క్రింద పది తొండాలు, ఇరవై చేతులు గల వినాయకుడి విగ్రహం ఉందని, దాని పేరు మహోత్కట్ గణపతి అని అంటారు. అయితే ఆలయ ధర్మకర్తలు మాత్రం అది నిజం కాదని చెబుతారు. ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది.
సూర్యకిరణాలు నేరుగా!
ఇక ఈ గణపతి ఆలయంలో దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై పడేలాగా ఆలయాన్ని నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత.