Pallikondeswara Swamy Temple : మన దేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. దాదాపుగా అన్ని శివాలయాల్లో చాలా వరకు శివుడు లింగ రూపంలో కానీ, విగ్రహ రూపంలో కానీ దర్శనమిస్తాడు. అయితే శివుడు చాలా ప్రత్యేకమైన భంగిమలో పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో శయన శివునిగా దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుందో, ఆ క్షేత్ర విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలోని పల్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే ఉండడం విశేషం. శ్రీ మరగదాంబిక సమేత పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రంలో వెలసిన శివుని శయన భంగిమకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉన్నది. పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రం వెనుక పౌరాణిక గాథ ఉంది.
వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం, దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా, భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన కంఠంలో దాచుకొన్నాడు. ఆ తరువాత శివుడు కైలాసానికి తిరిగి వెళ్లే సమయంలో సురుటుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి కాలకూట విష ప్రభావం వలన కొన్ని క్షణాల పాటు ఒక రకమైన మైకాన్ని పొంది పార్వతి ఒడిలో తల పెట్టుకొని శయనించాడట!
దేవతల ఉపచారాలు
నారదుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు, మహర్షులు అక్కడకు హుటాహుటిన విచ్చేసి పరమేశ్వరుడికి ఉపచారాలు చేయసాగారు. దాంతో తేరుకున్న శివుడు దేవతలందరి కోరిక మేరకు ఇక్కడ శయన భంగిమలో కొలువు తీరాడు. గరళం శివుని కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహా విష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలి రంగులోకి మారింది. ఆనాటి నుంచి శివుడు గరళకంఠుడని, నీలకంఠుడని ప్రసిద్ధి చెందాడు.
సురుటుపల్లి పేరు ఇందుకే!
నీలకంఠుడికి స్వస్థత చేకూర్చడం కోసం సురుటుపల్లికి తరలి వచ్చిన సురగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శన భాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురుల పల్లి అనే పేరు వచ్చింది. కాల క్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురటు పల్లిగా మారింది. శయన భంగిమలో ఉన్న శివుడిని దర్శించుకొంటే అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు.
ఆలయ విశేషాలు
భక్తుల పాలిట కల్పతరువుగా భావించే పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని 1344-47 మధ్య కాలంలో విజయనగరాధీశుడైన హరిహర బుక్కరాయలు నిర్మించారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేశారని ఆలయ గోడలపై శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ మేధా దక్షిణామూర్తిని ఆరాధిస్తే విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతుంది. ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకూ ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.