తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఇది కదా అసలైన ఫ్రెండ్​షిప్! స్నేహానికి పర్యాయ పదంగా నిలిచి శ్రీకృష్ణ-కుచేల కథ మీకు తెలుసా? - Krishna Kuchela Frienship Story - KRISHNA KUCHELA FRIENSHIP STORY

Krishna Kuchela Frienship Story : నీ మిత్రుడెవరో చెప్పు, నువ్వేంటో చెబుతాను అంటారు పెద్దలు. అంటే మన స్నేహం మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని పెద్దల అభిప్రాయం. మిత్రులు మన జీవితాన్ని అంత ప్రభావం చేస్తారన్నమాట. అందుకే స్నేహితుల ఎంపిక మన జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకువస్తుసంది. ఆగస్టు 4వ తేదీ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిజమైన స్నేహానికి అద్దం పట్టే ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలి!.

Krishna Kuchela Frienship Story
Krishna Kuchela Frienship Story (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 5:12 AM IST

Krishna Kuchela Frienship Story :ఈ రోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మనం స్నేహానికి అసలైన నిర్వచనం చెప్పి, గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీ కృష్ణ కుచేలుల కథను తెలుసుకుందాం.

కుచేలుడంటే!
శ్రీ బమ్మెర పోతన గారు రచించిన శ్రీ మద్భాగవత అంతర్భాగమైన కుచేలోపాఖ్యానం చదివితే నిజమైన స్నేహానికి అర్థం తెలుస్తుంది. శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్య మిత్రులు. కుచేలుని అసలు పేరు సుదాముడు. ప్రతిరోజు కుట్టడానికి కూడా వీలు లేని చిరుగుల వస్త్రాలు ధరించే వాడు కాబట్టి అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది.

సాందీపుని వద్ద కృష్ణకుచేలుల విద్యాభ్యాసం
భగవానుడైన శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్యను అభ్యసించాడు. అక్కడ కృష్ణునితో పాటు సుదాముడు కూడా చదువుకున్నాడు. అక్కడే ఈ ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. దీంతో శ్రీకృష్ణడు, సుదాముడు మంచి మిత్రులుగా గురుకులంలో పేరు తెచ్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకున్నాడు. సుదాముడు తన స్వగ్రామానికి వెళ్లిపోతాడు.

అల్పసంతోషి
కొద్ది రోజులకు సుదామునికి వివాహం జరుగుతుంది. సుదాముడు సహజంగా అల్పసంతోషి. ధనార్జన మీద పెద్దగా ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం నియమాలను పాటిస్తూ జీవిస్తుంటాడు. అతని భార్య కూడా ఎంతో ఉత్తమురాలు. పతికి ఎంతో అనుకూలంగా ఉంటూ ఉన్నంతలో సంసారాన్ని సాగిస్తూ ఉంటుంది.

దారిద్య్రం, బహు సంతానం
ఈ దంపతులు కర్మవశాత్తు ఎంతో దారిద్య్రాన్ని అనుభవిస్తూ ఉంటారు. దానికి తోడు వారికి బహు సంతానం కూడా. దీంతో ఈ దారిద్య్రం నుంచి బయటపడే మార్గం కోసం ఆలోచిస్తూ వారు జీవనం సాగిస్తూ ఉంటారు.

కుచేలునికి భార్య సలహా
ఒకరోజు కుచేలుని భార్య తన భర్తతో "స్వామీ! మీరు శ్రీకృష్ణుడు గొప్ప ప్రభువు ఐశ్వర్యవంతుడు, మీకు మంచి మిత్రులని చెబుతూ ఉంటారు కదా! ఒకసారి ఆ జగన్నాథుని కలిసి మన కష్టాలు చెప్పి సహాయం అడిగితే కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మనం ఈ దారిద్య్రం నుంచి బయట పడి, పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టి సుఖంగా ఆకలన్నది ఎరుగకుండా జీవిస్తాం. కదా! 'అడగనిదే అమ్మయినా పెట్టదని' అంటారు కదా. ఒకసారి వెళ్లి మీ బాల్య మిత్రుడైన కృష్ణుని కలిసి రండి' అని చెబుతుంది.

అటుకుల మూటతో శ్రీకృష్ణుని దర్శనానికి
భార్య మాటలు విన్న కుచేలుడు 'సంతోషంతో అలాగే వెళ్తాను. కానీ చాలా రోజుల తర్వాత నా మిత్రుని దగ్గరకు వెళుతున్నాను కదా ఖాళీ చేతులతో ఎలా వెళ్లను ఇంట్లో ఏమైనా ఉంటే ఇవ్వు తీసుకు వెళతాను' అని అంటాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఇల్లంతా వెతికి డబ్బాలో అడుగున ఉన్న కొన్ని అటుకులను మూటగా కట్టి ఇస్తుంది. వెంటనే బయలుదేరిన కుచేలుడు ధనం సంగతి ఎలా ఉన్నా తన చిన్ననాటి మిత్రుని శ్రీకృష్ణుని కలుసుకోబోతున్నాను అనే ఆనందంతో ద్వారకకు చేరుకుంటాడు.

ద్వారకా వైభవానికి ఆశ్చర్యపోయిన కుచేలుడు
ద్వారకా నగరానికి చేరుకున్న కుచేలుడు అక్కడ ఉన్న గొప్ప భవనాలు రాజ ప్రాసాదాలు చూసి నేను కృష్ణుని కలుసుకోగలనా లేదా! చిరిగిన వస్త్రాలతో ఉన్న నా అవతారం చూసి రాజ భటులు నన్ను రాజభవనంలో ప్రవేశం కల్పిస్తారో లేదో అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఏదైతే అదే అయింది అని చివరకు రాజభవనాన్ని చేరుకుంటాడు.

ఇది కదా కృష్ణుడంటే!
కుచేలుని అల్లంత దూరం నుంచి చూసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగున 'ఓయీ! కుచేలా! ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు రా! రా! అంటూ ఆప్యాయంగా భుజం చుట్టూ చేయి వేసి, లోనికి తీసుకెళ్లి ఉచితాసనం చూపించి, సకల సపర్యలు చేసి, అతని యోగ క్షేమాలను తెలుసుకుంటాడు. ఇది కదా! నిజమైన స్నేహమంటే!

స్నేహితుని కాళ్లు కడిగిన శ్రీ కృష్ణుడు
అంతటి భగవంతుడైన శ్రీ కృష్ణుడు, అతిథిగా వచ్చిన కుచేలుని పాదాలును రుక్మిణి సమేతంగా కడిగి ఆ నీటిని తన శిరస్సున చల్లుకుంటాడు. రుక్మిణీదేవి శిరస్సున కూడా చల్లుతాడు. మన ఇంటికి వచ్చిన అతిథిని ఎలా ఆదరించాలో సాక్షాత్తు భగవంతుడు తాను ఆచరించి మనకు చూపించాడు.

బాల్య స్మృతులు గుర్తు చేసుకున్న మిత్రులు
అనంతరం కుచేలునికి సకల అతిథి మర్యాదలు చేసి వారిద్దరూ బాల్యంలో వారు గురుకులంలో ఉన్నప్పటి సంగతులను గుర్తు చేసుకుని సంతోషంలో మునిగిపోతారు.

అటుకుల బహుమానం
అప్పుడు కృష్ణుడు 'ఓ కుచేలా! నీవు నా కోసం ఏమి తీసుకురాలేదా!' అని అడుగుతాడు. అప్పుడు కుచేలుడు సిగ్గుతో తన చిరుగులపై వస్త్రంలో భార్య కట్టి ఇచ్చిన అటుకులను ఇవ్వగా కృష్ణుడు ఎంతో ఆనందంతో 'నాకిష్టమైన అటుకులను తీసుకువచ్చిన నువ్వే నాకు నిజమైన మిత్రుడివి' అని ఒక గుప్పెడు అటుకులను తన నోటిలో వేసుకుంటాడు. మరో గుప్పెడు తీసుకోబోగా రుక్మిణి ఇక చాలు స్వామీ అని వారిస్తుంది.

పిడికెడు అటుకులతో సకలైశ్వర్యాలు
సాక్షాత్తూ ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన రుక్మిణీదేవికి తెలుసు శ్రీకృష్ణుడు ఒక గుప్పెడు అటుకులకే కుచేలునికి ఏమి ఇచ్చాడో! అందుకే వారిస్తుంది.

కుచేలుని తిరుగు ప్రయాణం
శ్రీకృష్ణుడు చేసిన అతిథి మర్యాదలకు ఆనందంతో పొంగిపోయిన కుచేలుడు కృష్ణుని నుంచి వీడ్కోలు తీసుకుని తన స్వగ్రామానికి బయలుదేరుతాడు. కొంచెం దూరం పోయాక అతనికి భార్య తమ దారిద్య్రం పోగొట్టే ఉపాయం కృష్ణుని అడగమన్న విషయం గుర్తుకు వస్తుంది. అయ్యో నేను కృష్ణుని కలిశానన్న ఆనందంతో అసలు విషయం మర్చిపోయానే అని అనుకోని 'అయినా పర్వాలేదు ఆ మహాత్ముని చూడటమే ఈ జన్మకు గొప్ప వరం, అయినా భగవంతుని ఇది కావాలి అని మనం అడగవలసిన అవసరమేముంది ఆ జగన్నాటక సూత్రధారికి తెలియని ఏముంది' అని తృప్తిగా ఇంటికి బయలుదేరుతాడు.

మారిపోయిన ఊరు వాడా చూసిన కుచేలుని సంభ్రమం
తన ఊరికి చేరుకున్న కుచేలుడు ఇంటి దరిదాపులకు చేరుకున్నాక, అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో యెన్నడూ చూడనే లేదు. నా నివాసం ఏమైంది అని కుచేలుడు వెతుకుతుండగా నౌకరులు ఎదురు వచ్చి, 'రండి! దయచేయండి స్వామీ!' అని రత్నమణిమయమైన ఆ భవనంలోకి కుచేలుని తీసుకుపోయారు. లోనికి వెళ్ళగానే, ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య ఎదురై, "స్వామీ! దయచేయండి" అని రత్న మాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకుని వెళ్లింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహమే అని అర్థమయింది.

తీరిన దారిద్య్రం- తరతరాలకు ఐశ్వర్యం
నోరు తెరిచి ఏది అడగకపోయినా తన పేదరికం తెలుసుకొని ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ఆ పరమాత్మకు, తన చిన్ననాటి సఖునికి కుచేలుడు మనసులోనే నమస్కరించాడు. ఆనాటి నుంచి కుచేలుని వంశంలో ఎవరు దారిద్య్ర బాధలను అనుభవించలేదు. ఇదేనండి! శ్రీ కృష్ణ కుచేల కథ.

స్నేహానికి మారుపేరుగా నిలిచిన ఈ స్నేహితుల కథను మనం ప్రపంచ స్నేహితుల దినోత్సవం నాడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో శ్రీకృష్ణునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే గుజరాత్​లోని పోర్​బందర్​లో కుచేలునికి కూడా ఆలయం ఉంది.

శ్రీ మద్భాగవత అంతర్భాగమైన ఈ కుచేలోపాఖ్యానం విన్నవారికి చదివిన వారికి శ్రీకృష్ణుని అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ కథను మీ పిల్లలకు తప్పకుండా చెప్పండి. వినిపించండి. వారికి నిజమైన స్నేహం అంటే తెలియజేయండి. స్నేహం విలువలను నేర్పండి. జై శ్రీకృష్ణ!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details