Hanuman Flag On Arjuna Chariot : వేదాలు, పురాణాలు హిందూ మతానికి సంపదలు. మన పురాణాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక యుగానికి మరో యుగానికి అనుసంధానం కనిపిస్తుంది. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని జెండా మీద త్రేతాయుగానికి చెందిన హనుమంతుని చిత్రం ఉండటానికి గల కారణం ఏమిటో తెలుసా! ఆసక్తి కలిగించే ఈ అంశాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు ఎందుకు?
ఒకానొక సమయంలో త్రేతా యుగానికి చెందిన హనుమంతుడు ద్వాపర యుగంలో అర్జునుని ముందు ప్రత్యక్షమయ్యాడంట! హనుమంతుడు అర్జునుని వద్దకు ఎందుకు వచ్చాడు? ఈ కథ ఏమిటో ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.
దేశయాటనలో అర్జునుడు
కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు. అలా అన్ని క్షేత్రాలు తిరుగుతూ రామేశ్వరాన్ని చేరుకున్నాడు. అక్కడ సాక్షాత్తు ఆ రాములవారు ప్రతిష్టించిన శివలింగాన్ని పూజించాడు. ఆపై సముద్రతీరాన తిరుగుతూ అక్కడ రామసేతువును గమనించాడు.
అర్జునుని సందేహం
వానరుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆ సేతువును చూడగానే అర్జునునికి ఓ ధర్మ సందేహం వచ్చింది. ‘రాముడు మహా శక్తి సంపన్నుడు కదా! గొప్ప విలుకాడు కదా! అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఓ దృఢమైన వంతెనని నిర్మించవచ్చు కదా!’ అని అర్జునుడు మనసులో అనుకున్నాడో లేదో శ్రీరాముని ధ్యానంలో ఉన్న హనుమకు ఆ సంగతి తెలిసిపోయింది.
సామాన్య వానరునిలా అర్జునుని వద్దకు హనుమ
అర్జునుని సందేహం తీర్చడానికి హనుమ సామాన్య వానరునిలా అర్జునుడి దగ్గరకు చేరుకుని "మీరు ఏదో సమస్యతో మధన పడుతున్నట్లు ఉన్నారు. ఏమిటీ విషయం?" అని అడిగాడు. దానికి అర్జునుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానరంకు తెలిపాడు.
అర్జునుని సందేహాన్ని తీర్చిన హనుమ
అర్జునుని సందేహాన్ని విన్న హనుమ "రాములవారు బాణాలతో సేతువుని నిర్మించ లేక కాదు! కానీ కొన్ని కోట్ల మంది వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే, రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితమని తలచి రాముడు వానరులతో వంతెనని నిర్మింపచేశారు" అని అర్జునుని సందేహాన్ని తీర్చాడు హనుమంతుడు.
హనుమతో అర్జునుని వాదన
హనుమంతుడు చెప్పిన సమాధానంతో అర్జునుడు ఏకీభవించలేదు. పైగా రాములవారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సిందంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాటా మాటా పెరిగింది. ధర్మ సందేహం కాస్తా గొడవకు దారితీసింది.
అర్జునునికి హనుమ సవాల్
హనుమంతుడు అర్జునునితో "నువ్వు గొప్ప విలుకాడివని నీ నమ్మకం కదా! సాక్షాత్తూ ఆ రాములవారినే అనుమానిస్తున్నావు కదా! మరి బాణాలతో నువ్వో వంతెనని కట్టిచూడు. ఆ వంతెన మీద నేను నడుస్తాను. నా బరువుకి తట్టుకుని ఆ వంతెన నిలిస్తే సరే. లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా?’ అని సవాల్ విసిరాడు.
అర్జునుని శపథం
హనుమ మాటలకూ పంతం పెరిగిన అర్జునుడు ‘నీ ధాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపోతే, ఓటమిని అంగీకరించడమే కాదు, ఇక్కడికిక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను,’ అని శపథం చేశాడు.
రసవత్తరమైన పోటీకి రంగం సిద్ధం
అర్జునునికి హనుమ మధ్య పోటీకి రంగం సిద్ధమైంది. అర్జునుడు తన విలువిద్య అంతా ప్రదర్శించి అద్భుతమైన ఓ శర వంతెనను నిర్మించాడు. కానీ ఏం లాభం! శ్రీరామ నామాన్ని జపిస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదో వంతెన కాస్తా తునాతునకలు అయిపోయింది. ఆ ధాటికి విస్తుపోవడం అర్జునుడి వంతయ్యింది. దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలను త్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు.
రంగప్రవేశం చేసిన కృష్ణ పరమాత్మ
అర్జునుడు అగ్నిప్రవేశం చేయబోయే సమయంలో ఓ బ్రాహ్మణుని రూపంలో శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేసాడు. జరిగిన విషయం తెలుసుకొని న్యాయనిర్ణేత లేకుండా నిర్వహించిన పోటీ చెల్లదు కాబట్టి మళ్ళీ పోటీ మొదలు పెడితే తాను పక్షపాతం లేకుండా సాక్షిగా వ్యవహరించి తీర్పు చెబుతానని అంటాడు.
మరోసారి శర వంతెన నిర్మాణం
ఈసారి అర్జునుడు తన ఆప్త మిత్రుడు, గురువైన శ్రీకృష్ణుని తలచుకొని శరవంతెనను నిర్మించాడు. ఆశ్చర్యం! శ్రీ కృష్ణుని లీలా విలాసంతో ఈసారి వారధి హనుమంతుని బరువుని తట్టుకుని నిలబడింది. అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా అది కించిత్తయినా కదలనే లేదు. అది చూసి హనుమంతునికీ, అర్జునుడికీ కూడా ఏదో అద్భుతం జరిగిందన్న విషయం అర్థమైంది.
అంతా పరమాత్మ లీల
ఆ సమయంలో హనుమకు, అర్జునునికి తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణపరమాత్ముడనీ అర్ధమయింది. ఎప్పుడైతే వారిలో తామే గొప్ప అన్న అహంకారం పోయి జ్ఞానోదయం కలిగిందో అప్పుడు పరమాత్మ వారి ముందు సాక్షాత్కరించాడు. తాను శ్రీరామావతారం లో ఉన్నప్పుడు తనను సేవించిన హనుమను, కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడినీ స్నేహబంధం తో కలిపాడు.
ఇందుకే అర్జునుని జెండాపై హనుమ చిత్రం
అలా హనుమ అర్జునుని మధ్య చిగురించిన స్నేహంతోనే అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు కొలువైనాడని అంటారు.
మంగళవారం, శనివారం రోజుల్లో ఈ కథను చదివినా విన్నా జయం కలుగుతుందని శాస్త్ర వచనం! జైశ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.