Kukke Subramanya Temple History : కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండగా, వాటిలో ఆది క్షేత్రంగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య క్షేత్రంగా ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య క్షేత్రంగా నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం విరాజిల్లుతున్నాయి. ఈ మూడు కర్ణాటకలో వెలసిన సుబ్రహ్మణ్యుని అద్భుతమైన క్షేత్రాలు. విశేషమేమిటంటే ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలలో మొదటిది అయిన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కుక్కే సుబ్రమణ్య క్షేత్రం ఎక్కడ ఉంది?
పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా, కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధార నదీ తీరాన కుక్కే ఒక చిన్న గ్రామం. ఇక్కడ వెలసిన సుబ్రమణ్య స్వామి ఆలయంలో స్వామి విగ్రహం పడగ విప్పి, కాపు కాస్తున్న ఆరు సర్పాల కాల నాగు వలె ఉంటుంది. శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలో ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపినట్లు, శంకరవిజయంలో తెలియ చేశారు. కుక్కే గ్రామం మధ్యలో ఈ ప్రాచీన ఆలయం ఉంటుంది.
ఎలా దర్శించాలి?
ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర ధార నదిలో స్నానం చేసి దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి దర్శనానికి, ఆలయం వెనుక తలుపు నుంచి భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకుని, మూలవిరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
గరుడ స్తంభం
మూలవిరాట్టు, ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం గరుడ స్తంభం ఉంటుంది. దీని లోపల నివాసం ఉండే వాసుకి సర్పం ఊపిరి నుంచి వెలువడే విష కీలల ప్రభావం నుంచి భక్తులను కవచంలా కాపాడటానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠంచినట్లుగా తెలుస్తోంది.
దివ్యానుభూతినిచ్చే సుబ్రహ్మణ్యుని విగ్రహం
గరుడ స్తంభం తరువాత బాహ్య, అంతర, సుబ్రమణ్య మందిరాలు ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో ఎత్తైన పీఠం ఉంది. ఆ పీఠం పైభాగంలో సుబ్రమణ్య, వాసుకిల విగ్రహాలు, క్రింద భాగంలో ఆరు తలల శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతాయి.
పురాణగాథ
స్కాంద పురాణం ప్రకారం, షణ్ముఖుడు తారకాసుర, పద్మాసుర అను రాక్షసులను సంహరించి, సోదరుడు వినాయకుడితో ఈ కుమార పర్వతాన్ని చేరుకుంటారు. రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంతో ఉన్న ఇంద్రుడు, తన కుమార్తె దేవసేనను ఇచ్చి ఈ ఆలయ ప్రాంతంలో మార్గశిర మాసం, శుద్ధ షష్ఠి నాడు వివాహం జరిపించినట్లు తెలుస్తోంది.
కుజదోష పూజలు
ఈ ఆలయంలో రోజూ జరిగే సర్ప దోష పూజలలో ఆశ్లేషబలి, సర్ప సంస్కారలు అతి ముఖ్యమైనవి. ఈ పూజలు జరిపించుకుంటే నాగ దోషం, కాలసర్ప దోషం, కుజ దోషం నుంచి భక్తులను సుబ్రమణ్య స్వామి రక్షిస్తాడని విశ్వాసం.
ఉత్సవాలు వేడుకలు
శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాలు, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి, ఆడికృత్తిక వంటి విశేష రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉన్నప్పటికినీ, విశేష రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది.
ఎలా చేరుకోవచ్చు?
బెంగళూరు, చిక్ మంగళూరు నుంచి రైలు, రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఏదో తెలియని కారణాల వల్ల వివాహం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలకు కారణమైన నాగ సర్ప దోషాలను పోగొట్టుకోడానికి కుక్కే సుబ్రహ్మణ్యుని క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.