Ganesha Puja For Education : హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధవారం వినాయకుడి పూజకు విశిష్టమైనది. నవగ్రహాలలో బుద్ధిని, జ్ఞానాన్ని, వ్యాపారాభివృద్ధికి ప్రసాదించే గ్రహం బుధుడు. బుధునికి అధిదేవత వినాయకుడు. అందుకే బుధవారం వినాయకుని పూజిస్తే జ్ఞానం, బుద్ధి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటాయని శాస్త్రవచనం. మరి వినాయకుని ఎలా పూజిస్తే ప్రసన్నుడవుతాడో ఈ కథనంలో చూద్దాం.
తొలి పూజల గణనాథుడు
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం వినాయకుని విఘ్ననాయకుడని, విఘ్నాధిపతి అని కొలుస్తారు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయకుని పూజ చేసి తీరాల్సిందే! తొలి పూజలందుకునే గణనాథునికి ఇష్టమైన వారం బుధవారం. అలాగే బుధవారానికి కూడా అధిపతి బుధుడు. ఈ క్రమంలో బుధవారం వినాయకుని ఏ విధంగా పూజిస్తే అనుగ్రహిస్తాడో చూద్దాం.
బుధవారం పూజాఫలం
వినాయకుని అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. బుధవారం రోజు చేసే ఈ పరిహారాలతో గణపతి అనుగ్రహంతో బుద్ధి వికాసం జరుగుతుంది. జ్ఞానం లభిస్తుంది. వ్యాపారంలో అఖండ విజయం, పట్టింది బంగారం కావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఏ ఇంట ప్రతి బుధవారం గణేశుని విశేషంగా పూజిస్తారో ఆ ఇంట సిరి సంపదలు, సుఖ సంతోషాలు నెలకొంటాయి.
గణేశ పంచరత్న స్తోత్రం
ప్రతి బుధవారం ఉదయాన భక్తి శ్రద్ధలతో పూజామందిరంలో గణేశుని ముందర గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించాలి. తరువాత వినాయకునికి బెల్లం నివేదించాలి. ఇలా చేయడం వలన కుటుంబ శ్రేయస్సు ఉంటుంది.
గరిక ప్రీతి గణపతి
ప్రతి బుధవారం సిద్ధి గణపతికి గరిక సమర్పించి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.
మోదక గణపతి
వ్యాపారంలో సానుకూలత కోసం అధిక లాభాల కోసం బుధవారం లక్ష్మీ గణపతికి మోదకాలు సమర్పించాలి.
ఉండ్రాళ్ళ గణపతి
విద్యార్థులు చదువులో చక్కగా రాణించి, విజయాలు సాధించాలంటే ప్రతి బుధవారం ఉచ్చిష్ట గణపతికి ఉండ్రాళ్ళు సమర్పించాలి.
ఐశ్వర్యం కోసం
ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కోరుకునే వారు బుధవారం సింధూర గణపతికి అభిషేకం, అర్చన జరిపించుకోవడం వలన జీవితంలో డబ్బుకు లోటుండదు.
సంకట విమోచన కోసం
కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సంకట విమోచన గణపతికి 5 కొబ్బరికాయలు, జిల్లేడు పూల సమర్పిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కుటుంబ శాంతి కోసం
కుటుంబంలో భార్య భర్తల మధ్య కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే 11 బుధవారాలు వినాయకుని ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి, బిల్వ దళాలు, కొబ్బరికాయ, అరటి పండ్లు వినాయకుడికి సమర్పిస్తే సమస్యలు తొలగిపోతాయి. చివరగా పూజ ఏదైనా భక్తి ప్రధానం. భక్తి శ్రద్ధలతో చేసే పూజలు శీఘ్రంగా సత్ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఆ గణనాథుని భక్తి శ్రద్దలతో పూజిద్దాం సకల శుభాలను పొందుదాం.
ఓం శ్రీ గణేశాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.