Naina Devi Temple History Nainital :ఏడాది పొడవునా భక్తుల రద్దీతో ఉండే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే నేత్ర సంబంధిత రోగాలు నయమవుతాయని విశ్వాసం. సతీదేవి కళ్ళు పడిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేమిటో తెలుసుకుందాం.
నైనా దేవి ఆలయం
వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి తాను చేసిన యజ్ఞానికి తన కుమార్తె సతీదేవి, శివుని ఆహ్వానించలేదు. శివుడు వారిస్తున్నా వినకుండా పుట్టింటిపై మమకారంతో దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అక్కడ శివనింద భరించలేక తనకు, తన భర్తకు జరిగిన అవమానాన్ని సహింపలేక యోగాగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తుంది. జరిగిన సంఘటన తెలుసుకున్న పరమ శివుడు ఆగ్రహంతో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సతీదేవి మరణాన్ని తట్టుకోలేని శివుడు ఆమె శరీరంతో తాండవం చేసిన సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండ ఖండాలుగా ఖండించాడు. అమ్మవారి శరీర భాగాలు భూమిపై పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి. అలా అమ్మవారి నేత్రం పడిన ప్రదేశం లో వెలసిన ఆలయమే నైనా దేవి ఆలయం. ఈ ప్రదేశంలో సతీదేవి నేత్రం పడిందని , తదనంతరం ఇక్కడ దేవత స్మారకార్థం ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. 'నైనా' అంటే 'కళ్ళు' అని అర్థం కాబట్టి ఈ దేవతను నైనా దేవిగా పూజిస్తారు.
నైనా దేవి ఆలయం ఎక్కడుంది?
ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌లో నైనా దేవి ఆలయం ఉంది. శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయం అమ్మవారిని దర్శిస్తే చాలు ఎలాంటి నేత్ర రోగాలైనా తగ్గిపోతాయని విశ్వాసం.
ఆలయ విశేషాలు
నైనీతాల్ సరస్సుకు ఉత్తర భాగంలో నైనా దేవి మందిరం ఉంది. నైనా దేవి నైనీతాల్ ప్రజల ప్రధాన ఆరాధ్య దేవత. గర్భాలయంలో నైనా దేవి తో పాటు గణేశుని విగ్రహం కూడా దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారి మరో రూపం కాళీ దేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు.
మనోభీష్టాలు నెరవేర్చే ఎర్రని వస్త్రం
నైనా దేవి ఆలయంలో ఉండే రావిచెట్టు నింగికి నేలకు నిచ్చెన వేసినట్లు ఎత్తుగా ఉంటుంది. అమ్మవారి పూజలో పెట్టి ఇచ్చిన ఎర్రని వస్త్రాన్ని ఈ చెట్టుకు కడితే మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.