Maha Kumbh Mela 2025 History : ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభ మేళా! త్వరలో కుంభ మేళా జరుగనున్న సందర్భంగా అసలు కుంభ మేళా ఎందుకు జరుపుతారు? ఎన్ని రోజులు జరుపుతారు? కుంభమేళాలో స్నానం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మహా కుంభ మేళా ఎప్పుడు? ఎక్కడ?
తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే ఏడాది 13 జనవరి 2025 పౌర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది.
మహాకుంభమేళా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది?
హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. మహాకుంభమేళా మన దేశంలో ప్రధానంగా ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో జరుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యం ఉంది.
పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు?
మహాకుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు, మత విశ్వాసాలు ఉన్నాయి. పోతనామాత్యుడు రచించిన మహా భాగవతం ప్రకారం క్షీరసాగర మధనంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాలలో పడ్డాయని, ఆ అమృత బిందువులు నాలుగు భూమిపై పడిన ఈ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతోంది?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం 12 సంవత్సరాలలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. గురు గ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు.
కుంభమేళాలో పవిత్ర స్నానం
పవిత్రమైన ఈ మహా కుంభ మేళాలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అయితే కుంభమేళాలో ఆచరించే స్నానాలలో రకాలు కూడా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
రాజ స్నానం
కుంభమేళాలో చేసే స్నానాలలోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజ స్నానం 13 జనవరి 2025 న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.
- రెండో రాజ స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025 రోజున చేస్తారు.
- మూడో రాజ స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు.
- నాలుగో రాజ స్నానం వసంత పంచమి, 3 ఫిబ్రవరి 2025 రోజున చేస్తారు.
- ఐదో రాజ స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 రోజున చేస్తారు.
- 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చివరి రాజ స్నానం చేస్తారు.
రాజ స్నానం ప్రాముఖ్యం ఏమిటి?
మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 న మహాశివరాత్రి వరకు కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజ స్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్య తిథుల్లో నదీస్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళా లో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. రానున్న మహాకుంభమేళాలో మనం కూడా పాలు పంచుకుందాం. మోక్షాన్ని పొందుదాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.