America New Rules for Visa from January 2025 : అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తేదీని ఎంచుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే రీ షెడ్యూల్ (మార్చుకునేందుకు) వీలుగా నిబంధనల్లో మార్పులు చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తేదీని ఖరారు చేసుకున్నా తర్వాత మూడుసార్లు తేదీలను లేదా ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రాంతాలను కూడా మార్చుకునేందుకు వీలుంది. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని కాన్సులేట్‌ల్లో వీసా ఇంటర్వ్యూ ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు.
బెంగళూరులో అమెరికా కాన్సులేట్ : అయితే కొత్త నిబంధనల ప్రకారం అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తేదీని ఒక్కసారి మాత్రమే ఇంటర్వ్యూ తేదీని, హాజరయ్యే ప్రాంతాన్ని మార్చుకోవాలి. ఒకవేళ అంతకమించి మార్పులు చేసుకోవాలంటే మరోసారి ఫీజు చెల్లించాలి. సాధారణంగా నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తు 185 అమెరికన్ డాలర్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జీదారులకు సమాన అవకాశాలు కల్పించేలా కొత్త మార్పులు తీసుకువస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నూతన నిబంధనలు జనవరి ఒకటో తేదీ 2025 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. మరోవైపు బెంగళూరులో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నెలలోనే దీనిని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ దేశ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టి గురువారం ప్రకటించారు.