BCCI SPECIAL GENERAL MEETING 2024 : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా ఇటీవలే జై షా బాధ్యతలు స్వీకరించారు. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. అలానే ఆశిష్ షెలార్ కూడా వెళ్లిపోవడంతో బీసీసీఐ కోశాధికారి పోస్టును కూడా భర్తీ చేయాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా బీసీసీఐ కార్యదర్శి పదవికి ఎవరు ఎంపిక అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకునేందుకు జనవరి 12న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ జనరల్ మీటింగ్ (SGM) నిర్వహించనున్నారు.
స్పెషల్ జనరల్ మీటింగ్ ఎందుకు?
బీసీసీఐ నియమ, నిబంధనల మేరకు, ఏదైనా ఖాళీగా ఉన్న పోస్ట్‌ను 45 రోజుల్లోపు స్పెషల్ జనరల్ మీటింగ్ నిర్వహించి భర్తీ చేయాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనవరి 12న సమావేశం జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర యూనిట్లకు నోటిఫికేషన్‌లు పంపినట్లు స్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
బీసీసీఐ కార్యదర్శిగా పనిచేస్తున్న జై షా డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశారు. వాస్తవానికి బీసీసీఐ కార్యదర్శిగా షా పదవీకాలం ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉంది. కానీ సుప్రీం కోర్టు ఆమోదం తెలిపిన లోధా కమిటీ సంస్కరణల ప్రకారం ఒక వ్యక్తి రెండు పదవులు నిర్వహించకూడదు. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి షా తప్పుకున్నారు.
బీజేపీ సీనియర్ రాజకీయ నాయకుడు ఆశిష్ షెలార్ ఇటీవల ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అతడు కూడా బీసీసీఐ కోశాధికారి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఎన్నికలకు ఏర్పాట్లు
ప్రస్తుతం అసోంకి చెందిన దేవజిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, కోశాధికారి స్థానం ఖాళీగా ఉంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతిని బీసీసీఐ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా నియమించింది. 1975 గుజరాత్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జ్యోతి, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 2017 జులై నుంచి 2018 జనవరి వరకు పనిచేశారు. అయితే ఈ పదవులకు అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా జరుగుతుందని అంతా భావిస్తున్నారు.
'జహీర్, నీ షేడ్స్ కనపడుతున్నాయి' - పల్లెటూరి చిన్నారి బౌలింగ్‌కు సచిన్ ఫిదా
'ఆ మ్యాచ్ ఓటమితో కోహ్లీ బాగా ఏడ్చాడు' - అనుష్క మాటలను గుర్తుచేసుకున్న ధావన్