Murder Case In Hyderabad : ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం వైపు నడుస్తున్న వేళ, కొన్ని చోట్ల ఇంకా మూఢనమ్మకాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాల్లోనే చేతబడులు చేస్తున్నారనే నెపంతో వారిపై దాడి చేసిన ఘటనలు అనేకం. కానీ ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగిన ఓ హత్య కేసు దర్యాప్తులో చేతబడి చేస్తున్నాడని స్నేహితుడిని అంతమొందిచాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడు సహా సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం : శేరిలింగంపల్లి చందానగర్‌లోని నెహ్రూ నగర్‌కు చెందిన మహ్మద్ ఫక్రుద్దీన్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నజీర్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. కొన్ని రోజుల క్రితం ఫక్రుద్దీన్ తండ్రి పక్షవాతంతో కాళ్లు, చేతులూ పడిపోయి మంచం పట్టాడు. ఇటీవలే ఫక్రుద్దీన్ కూడా అనారోగ్యం పాలయ్యాడు. అదీ కాక ఫక్రుద్దీన్ సోదరికి నిశ్చితార్ధం జరగగా ఈ పెళ్లి జరగదని, చెడిపోతుందని నజీర్ ఫక్రుద్దీన్‌కు ఒక సందర్భంలో తెలిపాడు. అన్నట్లుగానే 15 రోజులకే పెళ్లి కుమారుడు తరపు వాళ్లు ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో తన కుటుంబంలో జరుగుతున్న అరిష్టాలకు కారణం నజీర్ అని భావించిన ఫక్రుద్దీన్, అతన్ని చంపేందుకు పథకం రచించాడు.
చేతబడి పేరుతో హత్య : ఈ క్రమంలోనే ఈ నెల 21న రాత్రి నసీర్‌ను ఫక్రుద్దీన్ బైక్‌పై శేరిలింగంపల్లి గోపీ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఫక్రుద్దీన్ స్నేహితులు బురాన్, ఖలీం, అజర్, అలీ సైతం అక్కడకు రాగా, అంతా కలిసి మద్యం తాగారు. తర్వాత నసీర్‌తో వాదనకు దిగి కర్రలతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నసీర్‌ను స్థానికులు గమనించి కొండాపూర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఫక్రుద్దీన్, బురాన్, ఖలీంలను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో రౌడిషీటర్ బురాన్‌పై 8 కేసులు, కలీంపై 6 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
'ఎప్పుడూ ‘యూ బెగ్గర్’ అని అవమానించేవారు - అందుకే తాతయ్యను చంపేశా'
మేడ్చల్‌లో దారుణం - వెంటాడి, వేటాడి అన్నను హత్య చేసిన సొంత తమ్ముళ్లు