తిన్నాకొద్దీ తినాలనిపించే "మినప చెక్కలు" - నూనె ఎక్కువగా పీల్చవు! - నెవ్వర్ బిఫోర్ టేస్ట్! - MINAPA CHEKKALU RECIPE
ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినే అద్దిరిపోయే పిండి వంటకం - బియ్యం చెక్కలను మించిన టేస్ట్!
Published : Dec 20, 2024, 3:06 PM IST
Minapa Chekkalu Recipe in Telugu : పిండి వంటకాలు, రోజువారీ చిరుతిండిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయి చెక్కలు. వీటిని ఒక్కసారి చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకూ పసందుగా లాగించవచ్చు. అయితే, చాలా మంది చెక్కలను ఎక్కువగా బియ్యప్పిండితో ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఓసారి ఇలా "మినప చెక్కలను" ట్రై చేయండి. ఇవి బియ్యప్పిండి చెక్కల కంటే కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పైగా ఈ చెక్కలు చాలా తక్కువగా నూనెను పీల్చుకుంటాయి! మరి, ఇంకెందుకు ఆలస్యం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పొట్టు మినప్పప్పు - 1 కప్పు
- మిరియాల పొడి - 1 టేబుల్‌స్పూన్
- ఇంగువ - పావు చెంచా
- జీలకర్ర - 1 టీస్పూన్
- కరివేపాకు రెమ్మలు - 2
- శనగపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- కారం - 1 టేబుల్‌స్పూన్
- బటర్ - 1 టేబుల్‌స్పూన్
- తెల్ల నువ్వులు - 1 టేబుల్‌స్పూన్
- సన్నని కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- బియ్యప్పిండి - 1 కప్పు
- నూనె - వేయించడానికి తగినంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పొట్టు మినప్పప్పును గంటపాటు నానబెట్టుకోవాలి. అలాగే శనగపప్పునూ ఒక చిన్న బౌల్లో 60 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మినప్పప్పును వాటర్ వడకట్టి వేసుకొని కాస్త రవ్వ మాదిరిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు పిండి జార్కి అడ్డుపడకుండా 2 టేబుల్స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అనంతరం అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి, ఇంగువ, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పు, కారం, బటర్, తెల్ల నువ్వులు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసుకోవాలి.
- ఆపై అందులో బియ్యప్పిండిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అయితే, ఉండలు పర్ఫెక్ట్ షేప్ రాకపోతే ఇంకాస్త బియ్యప్పిండిని వేసుకొని కలుపుకోవాలి.
- ఆ తర్వాత పూరీ ప్రెస్ తీసుకొని దానిపై ఒక పాలిథిన్ కవర్ ఉంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఓ పిండి ఉండను పెట్టి లైట్‌గా వత్తుకోవాలి. పూరీ ప్రెస్ లేని వారు చపాతీ పీట మీద పాలిథిన్ కవర్ వేసి దానిపై కాస్త నూనె రాసి ఓ ఉండను పెట్టి చేతి వేళ్ల సాయంతో గుండ్రంగా వత్తుకోవాలి. అలాగని మరీ పల్చగా, మందంగా కాకుండా ఓ మాదిరిగా వత్తుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్న చెక్కలను ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే "మినప చెక్కలు" రెడీ!
- అయితే, ఈ చెక్కలను మరీ ఎర్రగా వేయించుకుంటే చేదు వస్తాయని గుర్తుంచుకోవాలి. ఆపై వీటిని చల్లారక గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సుమారు 15 నుంచి 20 రోజుల పాటు హాయిగా తినేయొచ్చు!
ఇవీ చదవండి :
బియ్యప్పిండితో జంతికలు చేస్తే గట్టిగా వస్తున్నాయా? - ఇలా ట్రై చేస్తే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి!