Peanut Poha Laddu Recipe in Telugu : చాలా మంది ఇష్టపడే స్వీట్ రెసిపీలలో ఒకటి లడ్డు. అయితే, ఎక్కువ మంది రొటీన్‌గా రవ్వ లడ్డు, నువ్వుల లడ్డూలు వంటివి చేసుకుంటుంటారు. కానీ, ఈసారి వెరైటీగా "పల్లీ అటుకుల లడ్డు" ట్రై చేయండి. అస్సలు నెయ్యి, నూనె వాడకుండా ప్రిపేర్ చేసుకునే ఈ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పైగా ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి! మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పల్లీలు - 1 కప్పు
- అటుకులు - అర కప్పు
- నువ్వులు - అర కప్పు
- సన్నగా తురిమిన బెల్లం - 1 కప్పు
- యాలకుల పొడి - 1 టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై ఇనుప కడాయి పెట్టుకొని పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు అదే కడాయిలో మందపాటి అటుకులు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్ మీదనే కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
- ఆ తర్వాత నువ్వులు వేసుకొని వాటిలో ఒక టేబుల్‌స్పూన్ వాటర్ చల్లుకొని కలుపుతూ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే నువ్వులు గుల్లగా, చక్కగా వేగుతాయి. ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అయితే, వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. అలాగే లడ్డూల రుచి అనేది మీరు పదార్థాలను వేయించుకునే తీరుని బట్టే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న అటుకులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం మరో మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించిన నువ్వులను వేసి మిక్సీ పట్టుకోవాలి.
- ఆపై అదే మిశ్రమంలో సన్నగా తురుమిన బెల్లం వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న బెల్లం మిశ్రమం, అటుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతితో గట్టిగా ప్రెజర్ ఇస్తూ లడ్డూ మాదిరిగా చుట్టుకోవాలి. అలా మిశ్రమం మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఒకవేళ ఎంత ట్రై చేసినా లడ్డూలు రానట్లయితే చేతులను కొద్దిగా తడిచేసుకుంటూ లడ్డూలను చుట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "పల్లీ అటుకుల లడ్డూలు" రెడీ!
- ఇక ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి! మరి, నచ్చితే మీరు ఓసారి ప్రయత్నించి చూడండి.
ఇవీ చదవండి :
సేమియాతో ఉప్మా, పాయసమే కాదు - ఇలా "లడ్డూలు" ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అదుర్స్!
కొలెస్ట్రాల్ తగ్గించి బరువును కంట్రోల్లో ఉంచే "అలసీ పిన్నీ" - సింపుల్‌గా చేసుకోండిలా!