Prithvi Shaws Discipline : యంగ్ ప్లేయర్ పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు ఎంపిక చేయకపోవడంపై ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్పందించింది. పృథ్వీ షా ఫిట్ నెస్, క్రమశిక్షణ, ప్రవర్తన బాగా లేకపోవడమే ఇందుకు కారణమని ఎంసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. పృథ్వీ షాకి శత్రువులెవరూ లేరని, తనకి తానే శత్రువు’ తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీ విషయంలో భంగపాటు ఎదురవడం వల్ల పృథ్వీ షా ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్టు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఎంసీఏ అధికారి ఒకరు తీవ్రంగా స్పందించారు.
'పృథ్వీ షా మైదానంలో ఉన్నా లేనట్లే'
"ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 10 మంది ఫీల్డర్లతో ఆడాం. పృథ్వీ షా మైదానంలో ఉన్నా లేనట్లే లెక్క. బంతి అతని పక్క నుంచి వెళ్లినా దాన్ని పట్టుకోలేడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా సరైన సమయంలో బంతిని హిట్ చేయడంలో ఇబ్బందిపడటం చూశాం. అతడి ఫిట్ నెస్, క్రమశిక్షణ, ప్రవర్తన కూడా బాగా లేవు. టీమ్ లోని సీనియర్లు కూడా ఇప్పుడు పృథ్వీ షా వైఖరిపై ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. గత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో షా చాలా సార్లు రాత్రిపూట బయటకి వెళ్లి ఉదయం ఆరు గంటలకు జట్టు ఉన్న హోటల్ కు వచ్చేవాడు. సరిగ్గా ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యేవాడుకాదు." అని ఎంసీఏ అధికారి ఒకరు తెలిపారు.
అలాంటి పోస్టులు ప్రభావం చూపవు!
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అవి ముంబయి సెలక్టర్లు, ఎంసీఏపై ప్రభావం చూపిస్తాయని అనుకోవడం తప్పని ఎంసీఏ అధికారి ఒకరు తెలిపారు. పృథ్వీ షా ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండటం లేదని పేర్కొన్నారు. ఎంసీఏ అకాడమీలో ఇచ్చిన ఫిట్ నెస్ ప్రోగ్రామ్‌ను పృథ్వీ షా పాటించలేదని వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
విజయ్ హజారే ట్రోఫీకి తనను ఎంపిక చేయకపోవడంపై పృథ్వీ షా ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్టు పెట్టాడు. 'చెప్పు దేవుడా. నేనింకా ఏమేం చూడాలి? విజయ్ హజారే ట్రోఫీలో 65 ఇన్నింగ్స్‌లలో 55.7 సగటు, 126 స్ట్రైక్ రేటుతో 3,399 పరుగులు చేసినా టోర్నీ ఆడేందుకు అర్హుడిని కానా? అయినా నీపై నా నమ్మకాన్ని వీడను. ఇప్పటికీ ప్రజలు నాపై విశ్వాసంతో ఉన్నారని భావిస్తున్నా. కచ్చితంగా తిరిగొస్తా. ఓం సాయిరాం' అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఎంసీఎ వర్గాలు తాజాగా స్పందించాయి.
సచిన్ అవుతాడనుకుంటే!
2018లో టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో చాలా మంది సచిన్ వారుసుడొచ్చేశాడని వ్యాఖ్యానించాడు. అయితే ఫిట్ నెస్, క్రమశిక్షణ తదితర విషయాల కారణంగా పృథ్వీ షా టీమ్ ఇండియా చోటు కోల్పోయాడు.
అలాగే ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీలో అతడు కూడా రాణించలేకపోయాడు. 9 మ్యాచుల్లో 197 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీకి అతడిని ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు. ఫిట్ నెస్, క్రమశిక్షణ కారణాలతో రంజీ ట్రోఫీ లీగ్ దశ మధ్యలోనే పృథ్వీని జట్టు నుంచి తొలగించింది. నవంబరులో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం వల్ల అన్ సోల్డ్‌గా మిగిలాడు.
అశ్విన్ బాటలో టీమ్ ఇండియా సీనియర్లు - వారు రిటైర్మెంట్ ప్రకటిస్తారా?
రోహిత్ విరాట్ కాకుండా ఈ ఏడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ప్లేయర్లు ఎవరంటే?