Srivilliputhur Andal Temple History : సాధారణంగా ఆలయాలలో అమ్మవారికి స్వామివారికి విడివిడిగా మాలలు వేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు ధరించిన మాలనే స్వామికి వేస్తారు. 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుప్పావై ప్రత్యేకం శ్రీవిల్లి పుత్తూరు క్షేత్ర దర్శనం
ధనుర్మాసంలో జరిగే తిరుప్పావై సందర్భంగా మహిమాన్వితమైన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. చూపరులను అబ్బురపరిచే శిల్పకళా సౌందర్యం, ఎత్తైన రాజ గోపురాలు, భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచే ఆండాళ్, రంగనాయక స్వామి విగ్రహం ఇవన్నీ ఈ ఆలయ ప్రత్యేకతలు. ఈ ఆలయంలో మరో విశేషమేమిటంటే ఇక్కడ వటపత్రశాయి శ్రీదేవి భూదేవితో కలిసి కొలువు తీరి ఉండడం. ఈ ఆలయాన్ని దర్శిస్తే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం.
ఆలయ స్థల పురాణం
నారాయణుని రాక్షస సంహారం
పూర్వం మార్కండేయ మహర్షి, భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసారంట! అప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. ఆ అరణ్యంలో ఉండే 'కాలనేమి' అనే రాక్షసుడు తరచూ మహర్షుల తపస్సుకు ఆటంకం కలిగిస్తుంటే ఆ మునులు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించారు. అప్పుడు నారాయణుడు ఆ రాక్షసులను అంతమొందించి శ్రీదేవి, భూదేవి సమేతంగా అక్కడే మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడంట! అందుకే అక్కడ స్వామికి వటపత్రశాయి అని పేరు వచ్చింది.
శ్రీవిల్లిపుత్తూర్ పేరు ఇలా వచ్చింది
రాక్షస సంహారం తర్వాత ఈ ప్రాంతాన్ని 'మల్లి' అనే రాణి పరిపాలించేది. ఆమెకు విల్లి, పుట్టన్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. వీరిద్దరూ ఒకసారి వేట కోసం అడవికి వెళ్లిన సమయంలో పులితో పోరాడుతూ పుట్టన్ చనిపోగా విల్లి సొమ్మసిల్లి తన సోదరుని శవం పక్కనే పడిపోయాడంట! అప్పుడు విల్లికి నారాయణుడు స్వప్నంలో కనిపించి ఈ అడవి ప్రాంతాన్ని అందమైన పట్టణంగా మార్చి తనకు ఆలయం నిర్మించి మర్రిచెట్టు కింద ఉన్న ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పాడంట! అలా చెబుతూ స్వామి పుట్టన్ను కూడా బతికించాడంట!
ఆలయ నిర్మాణం
స్వామి కలలో కనిపించి చెప్పినట్లుగా విల్లి, పుట్టన్ ఆలయం నిర్మించి శ్రీదేవి భూదేవి సమేత వట పత్రశాయిని ప్రతిష్టించారు. ఆ సోదరుల పేరుతోనే ఈ ఆలయానికి శ్రీవిల్లిపుత్తూర్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
స్వామి సేవలో తరించిన విష్ణుచిత్తుడు
ఈ ఆలయంలో నారాయణుని భక్తుడు విష్ణుచిత్తుడు ప్రతిరోజూ స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఆలయంలోని తులసి వనంలో ముద్దులొలికే పసిపాప దొరుకుతుంది. సంతానం లేని విష్ణుచిత్తుడు ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి 'గోదా' అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు.
గోదాదేవి కృష్ణ భక్తి
గోదాదేవి శ్రీకృష్ణుని మీద భక్తి విశ్వాసాలకు కలిగినది. గోదా చిన్న వయసులోనే కృష్ణ భక్తితో అనేక పద్యాలు రాసింది. ప్రతిరోజూ కృష్ణుడి కోసం తయారు చేసిన పూలమాలలు ముందుగా ఆమె ధరించి తరువాత కృష్ణుడికి పంపేది. ఈ విషయం తెలుసుకున్న విష్ణుచిత్తుడు భగవంతుని పట్ల అపచారం జరిగిందన్న బాధతో ఆలయానికి వెళ్లడం మానుకున్నాడు.
విష్ణు చిత్తునికి స్వప్న సాక్షాత్కారం
అప్పుడు విష్ణుచిత్తుడికి కలలో స్వామి కనిపించి గోదాదేవి ధరించిన మాలలు అంటే తనకు ఇష్టమని, అవే తనకు వేయమని కోరాడు. తరువాతి కాలంలో ఆ పాప పెరిగి పెద్దయి ఆండాళ్ గా మారి, శ్రీకృష్ణుని భర్తగా పొందాలని కోరికతో 30 దివ్యమైన పాశురాలను రచించింది. ఆమె కోరికను మన్నించి కృష్ణ స్వరూపమైన శ్రీరంగంలోని రంగనాధుడు గరుడ వాహనంపై రాజు రూపంలో శ్రీవిల్లిపుత్తూర్ వచ్చి గోదాదేవిని పరిణయమాడాడు. అంతట గోదాదేవి రంగనాధునిలో ఐక్యమైనదని అంటారు. ఈ విధంగా శ్రీ విల్లిపుత్తూర్ లో గోదాదేవి రంగనాథుని సమేతంగా వెలిసిందని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
ఎలా చేరుకోవచ్చు?
మధురై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి చేరుకోవడానికి రైలు, బస్సు, విమాన సౌకర్యాలున్నాయి. ధనుర్మాసంలో విశేషంగా జరిగే తిరుప్పావై 30 రోజులలో కనీసం ఒక్కరోజైనా శ్రీవిల్లిపుత్తూర్ ఆలయాన్ని దర్శించుకోవడం శుభప్రదమని శ్రీ వైష్ణవ భక్తుల విశ్వాసం. ఆండాళ్ తిరువడిగలే శరణం! జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.