Maha Shivaratri 2025 Lingodbhava Time:శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినానికి సమయం దగ్గరపడింది. ఈ పండగ రోజున దేశంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతాయి. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండగ ప్రత్యేకం. బిల్వపత్రార్చనలు, రుద్రాక్ష మాలాధారణలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణతో భక్తులుశివయ్య అనుగ్రహం కోసం వేడుకుంటారు. మరి ఈ సంవత్సరం శివరాత్రి ఎప్పుడు వచ్చింది? లింగోద్భవం సమయం ఎప్పుడు? ఆ సమయంలో ఏం చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది?:తెలుగు సంవత్సరాది ప్రకారం మహా శివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది చతుర్దశి తిథి 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. అయితే మహా శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి తిథి ఉండడం ప్రధానం. కాబట్టి మహాశివరాత్రిని ఫిబ్రవరి 26న జరుపుకోవాలని జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్కుమార్ చెబుతున్నారు.
లింగోద్భవ సమయం ఎప్పుడు: మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మహా శివరాత్రి రోజు రాత్రి 11.30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1.00 గంట మధ్య ప్రాంతంలో ఉండే సమయాన్ని 'లింగోద్భవ కాలం' అంటారని చెబుతున్నారు. ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించి, ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని వివరిస్తున్నారు.
- లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవుపాలతో అభిషేకం చేసి, పద్మ పుష్పాలతో పూజ చేయాలని చెబుతున్నారు. అలాగే నైవేద్యంగా పులగాన్ని సమర్పించాలని సూచిస్తున్నారు.
- లింగోద్భవ కాలంలో రెండో భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేయాలని, శివుడిగి నైవేద్యంగా పాయసం సమర్పించాలని సూచిస్తున్నారు.
- లింగోద్భవ కాలంలో మూడో భాగంలో పరమేశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు ఆకులతో పూజ చేయాలని పేర్కొంటున్నారు. అనంతరం పరమశివుడికి తిలాన్నం అంటే నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు.
- లింగోద్భవ కాలంలో చివరి భాగంలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ, తుమ్మి పూలతో పూజించాలని చెబుతున్నారు. అనంతరం పరమశివుడికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని వివరిస్తున్నారు.
ఈ దీపం వెలిగిస్తే మహాపుణ్యం: మహా శివరాత్రి రోజు ఏ సమయంలోనైనా సరే ఎర్రటి కొత్త ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి, 'దారిద్ర దహన శివ' స్తోత్రాన్ని చదివితే మహా పుణ్యం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే జన్మజన్మల దరిద్రం తొలగిపోతుందని మాచిరాజు వివరిస్తున్నారు.