Money Remedies As Per Astrology : ఇంట్లో ఈశాన్యం దిక్కుకు చాలా విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఈ దిక్కుకు అధిపతి ఈశానుడు. అంటే పరమేశ్వరుడు. కాబట్టి, ఇంట్లో ఈశాన్యం బలంగా ఉన్నప్పుడే శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్. ఈశాన్యంలో కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది అఖండ ధనలాభం సొంతం చేసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఈశాన్యంలో ఉంచాల్సినవి, ఉంచకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏ ఇంట్లోనైనా ఈశాన్య దిక్కులో లక్ష్మీ గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రోజూ ఆ ఫొటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అదృష్టం త్వరగా కలిసి వస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు.
అదేవిధంగా, ఆవు దూడ ఉన్న చిత్రపటం, కామధేనువు చిత్రపటం, పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న ఫొటో వీటిలో దేన్ని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నా అదృష్టం త్వరగా కలిసొచ్చి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటున్నారు.
ఒకవేళ ఏ ఫొటో లేకపోయినా ఈశాన్య మూలలో డైలీ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, మూడు వత్తులు వేసి దీపారాధాన చేసినా ఆర్థికంగా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. అయితే, ఈ దిక్కులో దీపం పెట్టేటప్పుడు "ఓం హం ఈశాన్యాయ నమః" అనే మంత్రాన్ని మనసులో 11 సార్లు చదువుకొని నమస్కారం చేసుకోవాలి.
కలశం : ఈశాన్యంలో కలశం ఉంటే చాలా మంచిది. అందుకోసం ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. తర్వాత అందులో ఒక మామిడి ఆకు లేదా తమలపాకును వేసి కొబ్బరికాయను ఉంచి దాన్ని ఈశాన్యంలో పెట్టాలి. ఇలా చేయడం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు. అయితే, రోజూ ఆ కలశంలో నీటిని మారుస్తూ ఉండాలి.
మహాలక్ష్మి అవతారాల గురించి తెలుసా? రోజూ స్మరించుకుంటే డబ్బే డబ్బు!
రాళ్ల ఉప్పు : ఒక చిన్న గిన్నెలో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకొని దాన్ని ఈశాన్యంలో ఉంచినా మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు. అయితే, ఈ ఉప్పును డైలీ మార్చాలి. మార్చిన పాత ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి.
బియ్యం : ఒక చిన్న బౌల్లో కొద్దిగా బియ్యం పోసి దాన్ని ఈశాన్య దిక్కులో ఉంచినా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
అలాగే, ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ధనలాభం కలుగుతుందట. ఇంటికి ఈశాన్య దిక్కులో విద్యార్థులు చదువుకునే రూమ్ ఉంటే వారు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడమే కాకుండా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వాస్తుశాస్త్రంలో పేర్కొన్నారు.
ఇవి ఈశాన్యంలో ఉండవద్దు!
- జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈశాన్యంలో కిచెన్ ఉండకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటే అలాంటప్పుడు ఒక ఆకుపచ్చ రంగులో ఉండే రాయిని ఎప్పుడూ వంటగదిలో ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం ద్వారా ఏదైనా దోషం ఉన్నా తొలగిపోతుందట.
- ఈశాన్య దిక్కులో బెడ్రూమ్, షూ రాక్లు ఉండకూడదు. అలాగే, బాత్రూమ్ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈ దిక్కులో స్నానాల గది ఉంటే శారీరకంగా, మానసికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట.
- ఈ దిశలో ఎలక్ట్రానిక్ వస్తువులేవి ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలా ఉంటే కుటుంబ కలహాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.
- ఇలా ఇంటికి శక్తివంతమైన ఈశాన్య మూలలో ఉంచే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం పొంది సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఉప్పు నీటితో స్నానం, లక్ష్మీదేవికి పచ్చకర్పూర హరతి- శుక్రవారం ఇలా చేస్తే డబ్బే డబ్బు!