తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కల్యాణం చేస్తే చాలు- మీ ఇంట్లో వెంటనే పెళ్లి భాజాలు మోగడం పక్కా! - KSHEERABDI DWADASI POOJA KATHA

పరమ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి విశేషాలు- క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం వెనుక ఉన్న గాథ ఏమిటంటే?

Ksheerabdi Dwadasi Pooja Katha In Telugu
Ksheerabdi Dwadasi Pooja Katha In Telugu (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 3:46 PM IST

Ksheerabdi Dwadasi Pooja Katha In Telugu :తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ 12 మధ్యాహ్నం వరకు ఏకాదశి ఘడియలు ఉండి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభవుతుంది. నవంబర్ 13 బుధవారం ఉదయం పదిన్నరకు ద్వాదశి ఘడియలు పూర్తవుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి పూజ సాయంత్రం జరుపుకుంటారు కాబట్టి సాయంత్రానికి తిథి ఉండటం ప్రధానం. అందుకే క్షీరాబ్ది ద్వాదశిని నవంబర్ 12నే జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఇదే రోజున ఏకాదశి కూడా జరుపుకోవడం మరో విశేషం.

తులసి పూజ విశిష్టత
హిందూ సంప్రదాయంలో తులసి పూజకి విశిష్ట స్థానం ఉంది. తులసి చెట్టు లేని ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కార్తిక మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామున కానీ, సంధ్యాసమయంలో గాని తులసి మొక్క వద్ద దీపం పెట్టడం మన సంప్రదాయంలో భాగం.

తులసికి ఎందుకంత పవిత్రత?
అసలు తులసికి ఎందుకంతటి పవిత్రత వచ్చిందంటే తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు, అగ్ర భాగమందు నాలుగు వేదాలు, మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్ర వచనం. అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు ఈ కింది శ్లోకాన్ని తప్పక చదువుకోవాలి.

"యన్మూలే సవతీర్థాని యన్మధ్యే సర్వదేవతా! యదగ్రే సర్వ వేదాశ్య, తులసీం త్వాం నమామహ్యం" అని చెప్పి నమస్కరించుకోవాలి.

తులసీ కల్యాణం వెనుక ఉన్న పౌరాణిక గాథ!
ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసీ కల్యాణం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృందను జలంధరుడు పెళ్లాడుతాడు. బృంద అందగత్తెయే కాకుండా మహా పతివ్రత. ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది. ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది.

జలందరుని సంహారం
రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అణచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు. ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండ యాత్రకు బయలు దేరుతాడు. అదే అదనుగా భావించి లోక కంటకుడైన జలంధరుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు. బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్లు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు.

తులసి, ఉసిరి, మాలతి ఇలా పుట్టాయి
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు బృందపై అనురాగాన్ని పెంచుకుంటాడు. అంతట ధాత్రి, లక్ష్మి, గౌరీ దేవి ముగ్గురు తమ తమ అంశలతో మూడు గింజలను సృష్టించి భర్త మరణంతో సతీసహగమనం చేసిన బృంద చితా భస్మంలో వానిని కలపమంటారు. అప్పుడు గౌరీ ఇచ్చిన గింజ నుంచి తులసి, లక్ష్మి ఇచ్చిన గింజ నుంచి ఉసిరిక, ధాత్రి ఇచ్చిన గింజ నుంచి మాలతీ ఉద్భవిస్తాయి. వీటిని చూచి విష్ణువు ప్రశాంత చిత్తుడై ఉంటాడు. ఈ మొత్తం సంఘటన అంతా కార్తిక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని చిలుక ద్వాదశి అని అంటారు.

ఇందుకే తులసీ కల్యాణం
ఇక ఆనాటి నుంచి క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి చెట్టుకు, ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వలన సకల కోరికలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం.

తులసీ కల్యాణం ఎలా చేయాలంటే
తులసి కోట ముందు రంగురంగుల ముగ్గు వేసి, తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను కానీ, కొమ్మను నాటి ఆ రెంటికి ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి, రకరకాల ఫల పుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి. చక్ర పొంగలి, పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం మంగళ హారతులు ఇచ్చి కల్యాణ క్రతువును పూర్తి చేయాలి.

ఈ విధంగా క్షీరాభి ద్వాదశి రోజు తులసీ కల్యాణం చేసిన వారి ఇంట త్వరలో పెళ్లి జరుగుతుంది. సకల సౌభాగ్యాలు, సిరి సంపదలతో ఆ ఇల్లు తుల తూగుతుంది.

ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details