Magha Puranam 9th Chapter : పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో తొమ్మిదవ అధ్యాయంలో ఇంద్రుడు గాడిద ముఖం నుంచి ఏ విధంగా విముక్తి పొందాడో ఈ కథనంలో శివపార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
శివపార్వతుల సంవాదం
శివుడు పార్వతితో "పార్వతి! మాఘ మాసం చేసే నది స్నానం మానవులనే కాదు దేవతలను కూడా ఏ విధంగా తరింపజేస్తుందో వివరించే కథను చెబుతాను శ్రద్ధగా ఆలకింపుము" అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయం
పూర్వం వేదవేదాంగాలను అవపోసన పట్టిన గృత్స్నమదమహర్షి గంగానదిలో శిష్యులతో కలిసి మాఘ స్నానం చేసి గంగాతీరమున శిష్యులకు మాఘపురాణ శ్రవణం చేయుచున్న సమయంలో జహ్నువు మాఘ స్నానం మహత్యము వివరింపమని గృత్స్నమదమహర్షి ని కోరగా మహర్షి ఈ విధంగా చెప్పసాగెను.
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం
"ఓ జహ్నువు! మాఘ మాసమున ప్రాతః కాలంలో సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘస్నానం చేసిన నరుడు ఇంద్రుని వలే సమస్త పాతకములు నుంచి ముక్తిని పొందుతాడు" అనగా అప్పుడు జహ్నువు మహర్షి "ఆర్యా! ఇంద్రుడు ఏమి పాపం చేసాడు? మాఘస్నానంతో ఇంద్రుని పాపాలు ఎట్లు పోయాయి? వివరంగా చెప్పమని కోరగా, గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగెను.
ఇంద్రుని వృత్తాంతం
కృతయుగంలో తుంగభద్రా నదీతీరంలో ఒక పుణ్యాశ్రమంలో సమస్త వేదాలు చదివిన మిత్రవిందుడను మహాముని తన పత్నితో కలిసి నివసిస్తుండేవాడు. ఈ మహర్షి ప్రతినిత్యం శిష్యులకు వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని బోధిస్తుండేవాడు. ఒకనాడు ఋషిపత్ని తుంగభద్రా నదిలో స్నానం చేసి నదీ తీరంలో కురులు ఆరబెట్టుకుంటూ కూర్చుని ఉన్నది. ఆ సమయంలో ఇంద్రుడు రాక్షసంహారం కోసం దిక్పాలకులతో, శూరులైన దేవతలతో కలిసి ఆకాశమార్గంలో వెళుతూ అతిలోక సౌందర్యవతియైన ఋషిపత్నిని చూసి మోహించాడు.
ఇంద్రుని కపటబుద్ధి
యుద్ధంలో రాక్షసులను జయించి తిరిగి స్వర్గానికి చేరుకున్న ఇంద్రునికి మనసులో ఋషిపత్ని మీద కోరిక అలాగే ఉండిపోయింది. ఇంద్రుడు తిరిగి మిత్రవిందుని ఆశ్రమానికి వచ్చిముని పర్ణశాల ద్వారం వద్ద నిలిచి ఋషిపత్నిని కామంతో చూడసాగెను. ఇంతలో మిత్రవిందుడు అపరాత్రి సమయంలో శిష్యులకు వేదాలు బోధించాలి కాబట్టి ఆయన శిష్యులను నిద్రలేపి వారికి వేదం బోధించసాగెను. ఇదే అదనుగా తలచి ఇంద్రుడు నిద్రిస్తున్న మిత్రవిందను లేపి తనతో సంగమించమని కోరాడు. అందుకు అంగీకరించని ఋషిపత్నిని బ్రతిమాలుతూ ఆమె అందాన్ని పొగడుతూ బుజ్జగిస్తూ తన కోరిక తీర్చమని ప్రాధేయపడ్డాడు. ఇంద్రుని చేష్టలకు ఋషిపత్ని కూడా కామ వికారానికి లోనై అతడితో సంగమించింది.
ఇంద్రుని శపించిన మిత్రవిందుడు
శిష్యులకు బోధన ముగించుకొని తిరిగి వచ్చిన మిత్రవిందుడు తన కుటీరంలో ఉన్న ఇంద్రుని చూసి వాడు జారుడని తలచి పట్టుకుని శిక్షించబోగా అప్పుడు ఇంద్రుడు తన నిజరూపంలో కనిపించి "నేను దేవేంద్రుడను! నా తప్పుకు సిగ్గుపడుతున్నాను. మన్నించమని కోరగా, జరిగినదంతా దివ్యదృష్టితో తెలుసుకున్న మిత్రవిందుడు తీవ్రమైన ఆగ్రహంతో"ఓరీ! జారకర్మ పరాయణుడా! నీవు క్షమించరాని పాపం చేసావు. నీకిదే నా శాపం! ఈనాటి నుంచి నీవు గాడిద ముఖంతో జారిన పెదవులతో నిటారుగా నిలుచున్న చెవులతో స్వర్గానికి పోయే శక్తిలేక భూలోకంలోనే పడివుండు" అని శపించాడు. అంత ఆ మిత్రవిందుడు తన భార్యను కూడా అరణ్యంలో పాషాణమై పడిఉండమని శపించి తన యోగమాయతో శరీరాన్ని విడిచి బ్రహ్మలోకాన్ని చేరాడు.
శాపఫలంతో ఇంద్రుని దురవస్థ
ఇంద్రుడు గాడిద ముఖంతో నిటారుగా ఉన్న చెవులతో ఘోరమైన కూతలు కూస్తూ, పద్మ పర్వతం చేరి అక్కడ ఒక గుహలో ప్రవేశించి గడ్డి గాదం తింటూ స్వర్గం పోయే శక్తి కోల్పోయి ఆ గుహలోనే నివసిస్తూ ఉన్నాడు. ఇంద్రుని శరీరం మాత్రమే మునుపటి వలే ఉంది.
స్వర్గంపై రాక్షసుల దండయాత్ర
ఇటు స్వర్గంలో దేవేంద్రుడు లేకపోవడంతో అదును చూసి రాక్షసులు స్వర్గంపై దండెత్తి యుద్ధం చేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ చేసే యుద్ధం వలన దేవతలు రాక్షసుల చేతిలో దెబ్బలు తిని ఓడిపోయి కొంతమంది దేవతలను స్వర్గానికి కాపలాగా ఉంచి మిగిలిన వారంతా ఇంద్రుని వెతుకుతూ బయల్దేరారు.
మునులను ఆశ్రయించిన దేవతలు
ఇంతలో మాఘ మాసం సమీపించింది. ఆకాశమార్గం నుంచి కొందరు మునులు సముద్ర స్నానం కోసం వచ్చారు. వారు సముద్రంలో పవిత్రమైన మాఘ స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘ పురాణం, మాఘ మాస వ్రతమహాత్యాన్ని చెప్పుకొనుచుండిరి. అప్పుడు దేవతలు ఆ మునీశ్వరులు వద్దకు వెళ్లి "మహానుభావులారా! మీరు చేయుచున్న వ్రతమేమిటి? దాని ఫలమేమి? మాకు వివరంగా చెప్పండి" అని అడిగారు.
దేవతలకు మాఘమాస వ్రతమహాత్యాన్ని వివరించిన మునులు
అప్పుడు ఆ మునులు దేవతలతో "దేవతలారా! మేము చేయుచున్నది మాఘవ్రతం. ఈ వ్రతం వలన సమస్త పాపాలు నశిస్తాయి. మాఘ మాసంలో సూర్యోదయం సమయంలో సముద్రంలో కానీ, నదిలో కానీ పవిత్ర స్నానం చేసి తీరంలో శ్రీహరిని పూజించి, మాఘ పురాణం శ్రవణం చేసిన వారి సకల పాపలు నశిస్తాయి. మాఘ మాసంలో చతుర్దశి, పౌర్ణమి తిథులలో బ్రాహ్మణులకు భక్తితో తిలాదానం, అప్పములు, అన్నదానం, పాయస దానం, కంబళి దానం, వస్త్రదానం చేసిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ మాఘ మాసాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు . ఎవరైతే మాఘ స్నానాన్ని, మాఘ వ్రతాన్ని హేళన చేసి అపహాస్యం చేస్తారో, కనీసం ఒక్కరోజైనా మాఘ స్నానం చేయకుండా ఉంటారో వారు అనేక నీచ జన్మలు ఎత్తి నరకంలో పడి కొట్టుకుంటారు. ఇదే మాఘమాస వ్రతమహత్యం" అని మునులు దేవతలకు వివరించారు.
మాఘవ్రతాన్ని ఆచరించిన దేవతలు
ఈ విధంగా గృత్స్నమదుడు జహ్ను మహర్షితో "ఓయీ! ఈ విధంగా ఆకాశంలో సంచరించే మునుల వాక్కులు విని దేవతలు ఇంద్రుని వెతికే తమ అభీష్టసిద్ధి కోసం సముద్ర స్నానం చేసారు. తరువాత వారంతా ఆ జగన్నాటక సూత్రధారియైన శ్రీహరిని శ్రీమహావిష్ణువు భక్తిశ్రద్ధలతో పూజించారు. ఇక వారి వ్రతఫలం ఎట్లున్నదో రేపటిరోజు కథలో తెలుసుకుందామన్న గృత్స్నమదుడు జహ్ను మహర్షుల సంవాదాన్ని వివరిస్తూ పరమ శివుడు తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! నవమాధ్యాయ సమాప్తఃఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం