Karthika Puranam Chapter 29 : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తిక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తిక ద్వాదశి వ్రత మహత్యమును గురించి అత్రి అగస్త్యుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. వశిష్ఠులవారు జనక మహారాజుతో అత్రి, అగస్త్యుల వారి సంవాదమును గురించి వివరిస్తూ 29వ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు.
అత్రి అగస్త్యులసంవాదము
అత్రి మహాముని అగస్త్యుల వారితో "ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనం చెప్పి, తిరిగి ఇట్లు చెప్పడం ప్రారంభించెను.
శాంతించిన దుర్వాసుడు - పరిసమాప్తి అయిన అంబరీషుని ద్వాదశి వ్రతం
సుదర్శన చక్రము అంతర్ధానమైన తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు చేసి, పాదములు కడిగి ఆ నీళ్ళను తన శిరస్సుపై చల్లుకుని "ఓ ముని శ్రేష్ఠా! నేను ఒక సామాన్య గృహస్తుడను. నా శక్తికొలది నేను శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటాను. ద్వాదశి వ్రతమును చేసుకొంటూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుము. మీపై నాకు అమితమైన అనురాగము ఉండుటచేతనే తమకు ఆతిథ్యమీయదలచి ఆహ్వానించాను. మీరు దయచేసి నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను, నా వంశమును తరింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు ఎంతో దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపము చేత నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేశారు. నేను ధన్యుడను అయ్యాను. మీరాక వలన నాకు సుదర్శన చక్రమును చూసే భాగ్యము కలిగింది. అందువలన నేను మీ ఉపకారం మరువలేకున్నాను" అన్నాడు.
దుర్వాసునికి అంబరీషుని పాదపూజ
"ఓ మహానుభావా! నా మనస్సు సంతోషముతో నిండిపోయింది. మిమ్మల్ని స్తుతించడానికి నాకు మాటలు రావడం లేదు. నా కళ్ళవెంట వచ్చే ఆనందభాష్పాలతో మీ పాదాలు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడి ఉంటాను. కావున ఓ పుణ్యపురుషా! నాకు మరుజన్మ లేకుండా ఉండేటట్లు, సదా మీ వంటి మునిశ్రేష్ఠుల పట్ల, ఆ శ్రీహరి పట్ల స్థిర చిత్తము కలిగి ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి ఆహ్వానించాడు.
దుర్వాసుడు అంబరీషుడు సహపంక్తి భోజనాలు
ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని దుర్వాసుడు ఆశీర్వదించి "ఓ రాజా! ఎవరు ఎదుటివారి బాధను తొలగించి వారి ప్రాణములు కాపాడుతారో, ఎవరు శత్రువులకైనను శక్తి కొద్దీ ఉపకారం చేస్తారో వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేస్తున్నాయి. నీవు నాకు ఇష్టుడవు. తండ్రితో సమానమైనవాడవు. నాకంటే నీవు చిన్న వాడవు కాబట్టి నేను నీకు నమస్కరించరాదు. నీవు కోరిన ఈ చిన్న కోరికను తప్పక తీరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతమును ఆచరించిన నీకు మనస్తాపము కలిగించినందుకు నేను ప్రాయశ్చిత్తం అనుభవించాను. ఇప్పుడు నీతో కలిసి భోజనం చేయడం నా భాగ్యంగా భావిస్తాను" అని దుర్వాసుడు పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం అతనితో కలిసి పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా విందును ఆరగించి, అంబరీషుని మనసారా దీవించి తన ఆశ్రమమునకు వెళ్లెను.
కార్తిక ద్వాదశి వ్రత ప్రభావం
ఈ వృత్తాంతమంతయూ కార్తిక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది. కావున "ఓ అగస్త్యా! కార్తిక శుద్ధ ద్వాదశి వ్రత ప్రభావం ఎంత గొప్పదో చూశావు కదా! ఆ దినమున శ్రీమహావిష్ణువు క్షీరసాగరము నందున శేష పానుపుపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కావున ఆ రోజుకు అంతటి మహిమ కలదు. ఏ మనుజుడు కార్తిక శుద్ధ ఏకాదశి రోజున కఠిన ఉపవాసం ఉండి, పగలంతా హరినామ సంకీర్తన చేస్తూ, రాత్రంతా కార్తిక పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి మరుసటి రోజు అనగా కార్తిక శుద్ధ ద్వాదశి రోజున తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనము చేస్తాడో, అట్టివాని సర్వ పాపాలు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలై పోతాయి. శ్రీహరికి ప్రీతికరమగు కార్తిక శుద్ధ ద్వాదశి అన్ని విధములుగా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎటువంటి సంశయము లేదు. మర్రిచెట్టు విత్తనము చాల చిన్నది. కానీ ఆ విత్తనమే ఒక మహావృక్షంగా మారుతుంది. అదే మాదిరి కార్తిక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచము పుణ్యమైనా, అది అవసాన కాలము నందు యమదూతల బారి నుంచి కాపాడి వైకుంఠమునకు చేరుస్తుంది. అందుకే ఈ కార్తిక వ్రతమును సమస్త మానవులు, దేవతలు కూడా ఆచరించి తరించారు. ఈ కథను ఎవరు చదివినను, విన్ననూ వారికి సకల ఐశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కలుగుతుంది" అని అత్రిమహాముని అగస్త్యులవారికి బోధించిరి.
ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో చెప్పిన అంబరీషుని కథను, ద్వాదశి వ్రత మహాత్యమును వశిష్ఠులవారు జనకునితో వివరిస్తూ ఇరవై తొమ్మిదవ రోజు కథను ముగించారు.
ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే! ఏకోన త్రివింశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.