Padmavathi Brahmotsavam Muthyapu Pandiri Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం జరుగనున్న ముత్యపు పందిరి వాహన విశిష్టతను తెలుసుకుందాం.
ముత్యపుపందిరిపై అలమేలుమంగమ్మ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శనివారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
ముత్యపు పందిరి వాహన విశిష్టత
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగ కు ప్రీతిపాత్రమైనవి. స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలిమి ముత్యంగా రూపొందుతాయని, ఈ ముత్యాలు ఏనుగుల కుంభ స్థలాల్లో ఉంటాయని అంటారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు తన కీర్తనల్లో అమ్మవారి నవ్వులు, చూపులు, మాటలు, సిగ్గులు మేలిమి ముత్యాల వంటివని కొనియాడారు. అటువంటి తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ముత్యపు పందిరి వాహన అంతరార్ధం
ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెబుతూ అమ్మవారు ఈ వాహనంపై ఊరేగుతారు. తన భక్తులందరూ కల్మషం లేని స్వచ్ఛమైన ముత్యం వలే ప్రకాశించాలని లోకానికి చాటి చెప్పడమే ఈ వాహన సేవ యొక్క పరమార్ధం. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో కన్నుల పండుగగా ఊరేగుతారు.
పూర్వజన్మ సుకృతం
ముత్యపు పందిరి వాహనంపై ఊరేగే పద్మావతి అమ్మవారిని దర్శించడం పూర్వ జన్మ సుకృతమని వేంకటాచల మహత్యంలో వివరించారు. శ్రీవారి పట్టమహిషి శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ ముత్యపు పందిరి వాహనంపై విహరిస్తున్న అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.