What To Do On Karthika Amavasya : పరమ పవిత్రమైన కార్తిక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ మాసమంతా నదీస్నానాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. కార్తిక వ్రతానికి పూర్ణ ఫలం దక్కాలంటే కార్తిక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు చేయాల్సిన విధి విధానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పితృదేవతల ప్రీత్యర్ధం
సాధారణంగా అమావాస్య రోజు చేసే కర్మలన్నీ పితృ దేవతల ప్రీతి కోసమే ఉంటాయి. పవిత్రమైన కార్తిక మాసంలో చేసిన స్నాన దాన జపాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే కార్తిక అమావాస్య రోజు పితృ దేవతలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా కార్తిక అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి?
కార్తిక అమావాస్య ఎప్పుడు?
నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10:30 నిమిషాల నుంచి అమావాస్య మొదలై డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 11:51 నిమిషాల వరకు ఉంది. సాధారణంగా అమావాస్య తిథి రాత్రి సమయంలోనే ఉన్న రోజునే జరుపుకుంటారు. అంతేకాకుండా పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వాలంటే అమావాస్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖచ్చితంగా ఉండాలి. ఈ లెక్కన చూస్తే నవంబర్ 30 వ తేదీనే అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
కార్తిక అమావాస్య రోజు పాటించాల్సిన విధి విధానాలు
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తిక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానమాచరించాలి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృదేవతలకు జల, తిల తర్పణాలు ఇవ్వాలి. సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి, నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి.
అమావాస్య దానాలు విశేష ఫలం
కార్తిక అమావాస్య రోజున మన శక్తికొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం చేయాలి.
దీపారాధన
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంట! అందుకే సూర్యాస్తమయం తర్వాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు, దేవుని దగ్గర, తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రవచనం. అదే విధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. కార్తిక అమావాస్య రోజున చీమలకు పంచదార ఆహారంగా ఇవ్వడం వలన శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది.
ఉపవాస దీక్ష
కార్తిక బహుళ అమావాస్యతో కార్తిక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ రోజు ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. రానున్న అమావాస్య రోజు పండితులు, శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిద్దాం. పితృ దేవతల అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.కార్తిక అమావాస్య రోజు పితృ కార్యాలతో శుభ ఫలితాలు