Maharashtra Next CM : మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. నాలుగింట మూడు వంతుల మెజారిటీతో ఘన విజయం సాధించిన మహాయుతి తరఫున ముఖ్యమంత్రి ఎవరనేది స్పష్టం కాలేదు. మహారాష్ర్ట సీఎం రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ కాకుండా కొత్త పేరు తెరపైకి వచ్చింది. సీఎంగా కొత్తగా బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ పేరు వినిపిస్తోంది. బీజేపీ పుణె ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో పుణె మేయర్‌గా మురళీధర్ పనిచేశారు. రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారంలో లేని మురళీధర్‌ను బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ర్ట సీఎం పదవికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు దేవేంద్ర ఫడణవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. వీటిపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 2 లేదా ఆ తర్వాతే ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
ఫడణవీస్‌పై సీఎం పదవిపై నీలినీడలు?
గత రెండేళ్లుగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం మనోజ్ జారంగే పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఫడణవీస్‌పై మనోజ్ జారంగే విమర్శలు గుప్పించారు. ఫడణవీస్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే, తాను మరోసారి నిరాహార దీక్ష తీసుకుంటానని గతంలో జారంగే అన్నారు. అయితే, ఇంతకుముందు మహాయుతి మొదట విడత ప్రభుత్వం జారంగేకు పలు హామీలు ఇచ్చినా, రిజర్వేషన్ల సమస్య కొలిక్కి రాలేదు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ జారంగే ఏ అభ్యర్థులను పోటీకి దించలేదు. అయినా, మరాఠాలు మహాయుతికి అండగా నిలిచారు.
మహారాష్ట్రలో మరాఠాలు చాలా ప్రభావం చూపుతారు. మరాఠ్వాడాలో ఉన్న 46 స్థానాల్లో 40 సీట్లలో మహాయుతి జయకేతనం ఎగురవేసింది. అందులో బీజేపీ సొంతంగా 19 గెలవగా- అందులో 11మంది మరాఠా అభ్యర్థులే విజయం సాధించారు. అయితే, మనోజ్ జారంగే అంతగా ప్రభావం చూపకపోయినా, బీజేపీ అగ్ర నేతలు మాత్రం వ్యూహత్మకంగా ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు జయంత్ మైంకర్ అన్నారు. ఇప్పటికీ ఫడణవీస్ సీఎం పోస్టుకు బలమైన పోటీదారు అని, అయితే మహా రాజకీయ వేదికపై మరాఠా రిజర్వేషన్ అంశం కూడా అంతే ముఖ్యమైనదని మైంకర్ వివరించారు.