తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి ఏకాదశి- ఈ నియమాలు పాటిస్తే మోక్షం ఖాయం! - MUKKOTI EKADASHI 2025 DATE

మూడు కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి అనుగ్రహించే ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి పూజ ఎలా చేయాలంటే?

Mukkoti Ekadashi 2025 Date
Mukkoti Ekadashi 2025 Date (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 4:44 AM IST

Mukkoti Ekadashi 2025 Date :వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్య మాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి.

ఈ ఏడాది ముక్కోటి ఎప్పుడు
పైన చెప్పిన విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2024 వ సంవత్సరంలో అసలు ముక్కోటి ఏకాదశి రాలేదు. కొత్త సంవత్సరం 2025 జనవరి 10 వ తేదీ పుష్య మాసం శుక్ల పక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని పండితులు పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

ముక్కోటి ఏకాదశి విశిష్టత
శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై, మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అష్టాదశ పురాణాల ద్వారా తెలుస్తోంది.

ముక్కోటి ఏకాదశి పూజకు సుముహూర్తం
ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే ప్రాధాన్యత. కాబట్టి ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఉత్తర ద్వార దర్శనంగా పిలిచే వైకుంఠ ద్వార దర్శనం చేయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంట్లో బ్రహ్మి ముహూర్తంలో శ్రీ లక్ష్మీ నారాయణులను యథాశక్తి పూజించి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఆలయాలలో శ్రీ విష్ణువుకు తులసి మాల భక్తితో సమర్పించాలి.

ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండడం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు.

సాయంకాలం సంధ్యా కాల పూజ చేసుకుని, ఆ రాత్రి జాగరణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కధలు, హరికథా కాలక్షేపం, సత్సంగం తో జాగరణ చేస్తే జాగరణ ఫలం సంపూర్ణంగా దక్కుతుంది.

ఏకాదశి అంతరార్థం
ఏకాదశి అంటే 11. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజు ఈ పదకొండును అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అంతరార్థం.

ఉపవాసం అంటే?
ఉప + ఆవాసం అంటే ఈ రోజంతా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవన్నామ స్మరణలో కాలం గడపడం!

జాగారం
జాగారం అంటే ఏకాదశి నాటి రాత్రి ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టి జాగరూకతతో విష్ణువు సేవలో గడపడమే!

ముక్కోటి ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. భగవత్ తత్వం బోధపడుతుంది. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు నిష్ఠగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల్లో కన్నా కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుంది.

భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచియై నిత్య పూజా కార్యక్రమం ముగించుకొని ఒక సద్భ్రాహ్మణునికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకుని భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి.

ఏకాదశి రోజు ఉపవాసం చేసి హరినామ స్మరణ తో గడిపిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్య ఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. రానున్న వైకుంఠ ఏకాదశి రోజు మనం కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసి, ఉపవాస జాగారాలతో విష్ణుమూర్తిని సేవించి తరిద్దాం.

జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details