Devi Sri Prasad About Janhvi Kapoor : స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన 'పుష్ప' సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఇందులో అల్లు అర్జున్ మేనరిజం, శ్రీ వల్లి యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. సెలబ్రిటీలు సైతం పుష్ప రాజ్ డైలాగ్స్, మేనరిజాన్ని ఇమిటేట్ చేశారు.
అయితే వీటితో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మరింత పాపులర్ చేసింది. వాటిలోనూ ఐటెమ్ సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 'ఊ అంటావా మామా', 'కిసిక్' లాంటి సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మూడో పార్ట్‌లోని స్పెషల్ సాంగ్‌కు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ డ్యాన్స్ వేస్తే బాగుంటుందంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"పుష్ప 2'లోని కిస్సిక్ పాటలో ఎవరు నటించినా సరే ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అవుతారని మాకు ముందుగానే తెలుసు. శ్రీలీల ఓ అద్భుతమైన డ్యాన్సర్. అందుకే ఆమెను తీసుకుంటే బాగుంటుందని నేను మేకర్స్‌కు సలహా ఇచ్చాను. ఎంతోమంది టాప్ హీరోలు మొదటిసారి నా కంపోజిషన్‌లోనే స్పెషల్ సాంగ్స్‌లో అలరించారు. సమంత, పూజా హెగ్డే, శ్రీలీల, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ అందరూ టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే అటువంటి సాంగ్స్‌లో నటించారు. ఇక 'పుష్ప 3'లోని స్పెషల్ సాంగ్‌లో కనిపించేవారి గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ తుది నిర్ణయం తీసుకుంటారు. పాట ఆధారంగా హీరోయిన్‌ను కూడా ఎంపిక చేస్తారు. మంచి డ్యాన్సర్లు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సాయి పల్లవి డ్యాన్స్‌కు నేను పెద్ద అభిమానిని. అలాగే జాన్వీ కపూర్ కూడా అద్భుతమైన డ్యాన్సర్. ఆమె పాటలు కొన్నింటినీ నేను చూశాను. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఆమెలో ఉంది. జాన్వీ అయితే ఆ పాటకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి పాటలు హిట్ కావడానికి డ్యాన్స్ కూడా ఓ ముఖ్య కారణం" అని దేవీశ్రీ చెప్పారు.
'పుష్ప పార్ట్ 3' కన్ఫార్మ్ - ప్రొడ్యూసర్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్