Vaikunta Ekadasi 2025 :వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని మోక్షం లభిస్తుందని నమ్మకం. అందుకోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం.
వైకుంఠ ఏకాదశి ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జనవరి 09, గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై జనవరి 10, శుక్రవారం ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం తిథిని అనుసరించి వైకుంఠ ఏకాదశి జనవరి 10 శుక్రవారం జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుఝామునే 3:30 గంటలకు వైష్ణవ ఆలయంలో ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ ముహూర్తం.
వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు:
ఉపవాసం:వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఉపవాసం. ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. నక్షత్ర దర్శనం తరువాత పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి.
జాగారం:విష్ణు భక్తికి ప్రతీక జాగారం. వైకుంఠ ఏకాదశి నాటి రాత్రి నారాయణ నామ సంకీర్తనతో, భజనలతో, భాగవత కథా కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వలన మోక్షాన్ని పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది.
పూజావిధానం:ఈ రోజు శ్రీమహావిష్ణువును అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. విష్ణువుకు ప్రీతికరమైన పసుపు రంగు పువ్వులను, తులసి మాలను సమర్పించాలి. పులిహోర, చక్రపొంగలి నైవేద్యంగా సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం వలన మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.