Bhadrachalam Temple History In Telugu : సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనది. ముక్కోటి దేవతలు భూమిపైకి తరలి వచ్చే ఈ శుభదినం రోజు శేష పాన్పుపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం పుణ్యప్రదమని విశ్వాసం. అన్ని వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి నాడు ఉత్తరద్వార దర్శనం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ రాముడు నడయాడిన పవిత్ర క్షేత్రం భద్రాచల క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భద్రాచలం ఎక్కడుంది?
దక్షిణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామునికి పరమ భక్తుడు. అతనికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఇక్కడ వెలిసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
స్థల పురాణం
పౌరాణిక ప్రాశస్త్యంతో పాటు ఘనమైన చరిత్ర కల భద్రాద్రి క్షేత్ర స్థలపురాణం ప్రకారం భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలు శ్రీరామునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో రాముని నిత్యం సేవిస్తుండేది. ఒకనాడు శ్రీరాముడు ఆమెకు స్వప్నంలో కనిపించి తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై వెలసి ఉన్నానని, భక్తులందరూ తనను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయమని, ఇందుకు ఇంకో భక్తుని సహకారం కూడా ఆమెకు ఉంటుందని చెప్పి అదృశ్యమయ్యాడంట!
పందిరి కింద వెలసిన రామయ్య
దమ్మక్క తనకు వచ్చిన కల గురించి గ్రామస్థులకు తెలిపి భద్రగిరిపైకి వెళ్లి అక్కడ ఉన్న రామునికి పందిరి వేసి రోజు పండ్లు నైవేద్యంగా సమర్పించసాగింది. ప్రతి ఏడాది సీతారాముల కల్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించేదంట!
భక్త రామదాసుచే ఆలయ నిర్మాణం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంకు చెందిన కంచర్ల గోపన్న గోల్కొండ ప్రభువు తానిషా కొలువులో పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు మేనల్లుడు. మేనమాల సహకారంతో కంచర్ల గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దారుగా బాధ్యతలు నిర్వహిస్తుండేవాడు. భద్రాద్రిపై వెలసిన శ్రీరాముని గురించి తెలిసి రామునిపై అమితమైన భక్తి విశ్వాసాలతో ప్రజల నుంచి పన్ను రూపంలో వసూలు చేసిన ఆరు లక్షల మొహరీలతో భద్రాద్రి రామునికి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడు.
రామదాసుకు కారాగారం
ఈ సంగతి తెలిసి ఆగ్రహించిన తానిషా గోపన్నను కారాగారంలో పెట్టించి శిక్షించాడు. 12 సంవత్సరాలు ఖైదులో నానాకష్టాలు అనుభవించిన గోపన్న కారాగారంలోనే తన దుస్థితిని శ్రీరామునికి తెలియజేస్తూ వందలాది కీర్తనలు ఆలపించి భక్త రామదాసుగా పేరొందాడు.
తానీషాకు స్వయంగా బాకీ చెల్లించిన రాముడు
చివరకు రామదాసు ప్రార్ధనలు ఫలించి శ్రీరాముడు లక్ష్మణుడు స్వయంగా వచ్చి తానీషాకు 6 లక్షల మొహరీలు చెల్లించి రసీదు తీసుకొని, రామదాసును ఖైదు నుంచి విడిపించారు.
ఇవి చూడాల్సిందే!
ఇప్పటికి భద్రాచలం వెళ్తే శ్రీరామదాసు రామలక్ష్మణులకు, సీతాదేవికి చేయించిన ఆభరణాలు, శ్రీరాముడు స్వయంగా చెల్లించిన మొహరీలు, అప్పటి పరికరాలు ఆలయంలో చూడవచ్చు.
పంచవటి ఇదేనా!
భద్రాచలం ఆలయం నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలను కూడా తప్పకుండా చూడాల్సిందే! త్రేతాయుగంలో వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులు నివసించిన పంచవటిగా పేరొందిన పర్ణశాల ఇదేనని, రామాయణ గాధ లోని కొన్ని ఘట్టాలకు ఇవి సజీవ సాక్ష్యాలని భక్తుల విశ్వాసం. ఇక్కడే అమ్మవారు నారచీరలు ఆరబెట్టుకున్న గుర్తులను కూడా చూడవచ్చు. భద్రాచలంలో వెలసిన శ్రీ రామాలయం లో శ్రీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం పూజలు, కైంకర్యాలు జరుగుతాయి. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం భద్రాచలం. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భం భద్రాద్రి రాముని మనసారా స్మరిద్దాం. తరిద్దాం. జైశ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.